Farm Laws: ఔను.. మేం విఫలమయ్యాం.. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: యూపీ సీఎం యోగి

By telugu teamFirst Published Nov 19, 2021, 7:31 PM IST
Highlights

సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సాగు చట్టాలకు మెజార్టీ రైతు సంఘాల నుంచి మద్దతు లభించిందని వివరించారు. కానీ, కొన్ని రైతు సంఘాలే ఈ చట్టాలను వ్యతిరేకించాయని, వారిని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని తెలిపారు.
 

లక్నో: మూడు సాగు చట్టాల(Farm Laws)ను రద్దు చేస్తామన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రకటనను ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్య మంత్రి యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) స్వాగతించారు. రైతు(Farmers)లను ఒప్పించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయాస పడిందని, ఎంతో శ్రమించినప్పటికీ కొత్త చట్టాలపై వారికి సానుకూల దృక్పథాన్ని కలిగించడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. రైతులను మెప్పించలేకపోయినందుకు బాధపడుతున్నట్టు తెలిపారు. ఈ తరుణంలోనే ప్రధాన మంత్రి చేసిన ప్రకటనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వాగతం తెలుపుతున్నట్టు వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాగు చట్టాల రద్దు ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత యోగి ఆదిత్యానాథ్ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. 

ప్రతి దశలోనూ రైతులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆ వీడియో సందేశంలో తెలిపారు. మా సందేశాన్ని రైతులకు వివరించడంలో మా వైపే లోపమున్నదేమో అని పేర్కొంటూ వారిని ఒప్పించలేకపోయామని అన్నారు. కొత్త సాగు చట్టాలపై రైతులకు సానుకూల అభిప్రాయాన్ని తీసుకురావడంలో విఫలమయ్యామని వివరించారు.

Also Read: Farm Laws: చట్టాల రద్దుపై ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు విభాగం ఏమన్నదంటే?

అయితే, సాగు చట్టాలను ఉపసంహరించడమూ చరిత్రాత్మకమే అని యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఈ రోజు అంటే గురుపురబ్ రోజున ప్రధాన మంత్రి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన మంత్రి ఈ విధంగా మాట్లాడటం, సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడం చరిత్రాత్మకమని తెలిపారు. అయితే, సాగు చట్టాలపై మెజార్టీ రైతుల నుంచి ప్రభుత్వానికి మద్దతు లభించిందనీ పేర్కొన్నారు. కానీ, కొన్ని వర్గాల రైతులను మాత్రమే తాము ఒప్పించలేకపోయామని తెలిపారు. రైతుల ఆదాయాలు పెంచడంలో ఈ సాగు చట్టాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని చాలా మంది రైతులు భావించారని వివరించారు. కానీ, కొన్ని రైతు సంఘాలు మాత్రమే ఈ సాగు చట్టాలను వ్యతిరేకించాయని తెలిపారు. వారిని ఒప్పించడానికి తాము ఎంతో ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన బాటపట్టారని చెప్పారు. కాగా, కనీస మద్దతు ధరపై కమిటీ వేస్తామన్న ప్రధాన మంత్రి నిర్ణయాన్నీ ఆయన స్వాగతించారు.

సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం కూడా స్వాగతించింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన ఆశ్చర్యకరంగా ఉన్నదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ(ఆర్ఎస్ఎస్/RSS) అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ పేర్కొంది. నిజానికి ఈ చట్టాల రద్దుతో దీర్ఘకాలంలో రైతులే నష్టపోతారని భారతీయ కిసాన్ సంఘ్ సంస్థాగత కార్యదర్శి దినేశ్ కులకర్ణి తెలిపారు. అదే విధంగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేననీ అన్నారు. అనవసరమైన వివాదాలను పక్కన పెట్టడానికి చట్టాలు రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలిపారు.

Also Read: Farm Laws: మన దేశంలో చట్టాన్ని ఎలా రద్దు చేస్తారో తెలుసా?

గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు సాగు చట్టాలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలు దేశవ్యాప్తంగా రైతాంగంలో కలకలం రేపింది. ఈ మూడు చట్టాల ద్వారా తాము కార్పొరేట్లకు మోకరిల్లే పరిస్థితులు దాపురిస్తాయని భయాందోళనలు వ్యక్తం చేసింది. ఫలితంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో స్థానికంగా ఆందోళనలు జరిగాయి. తర్వాత ఢిల్లీ సరిహద్దుకు ఆందోళనలు చేరాయి.

click me!