ఆవులు పవిత్రమైనవి, మేము తల్లిగా గౌరవిస్తాము.. కానీ కొందరు.. : వారణాసి వేదికగా ప్రధాని మోదీ

By Sumanth KanukulaFirst Published Dec 23, 2021, 4:29 PM IST
Highlights

ప్రధాన నరేంద్ర మోదీ(Narendra Modi)  మరోసారి ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆవుల గురించి మాట్లాడాన్ని కొందరు నేరంగా చేశారని.. కానీ తాము మాత్రం ఆవులను తల్లిగా (Cows As Mothers) గౌరవిస్తామని ప్రధాని మోదీ అన్నారు.

ప్రధాన నరేంద్ర మోదీ(Narendra Modi)  మరోసారి ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆవుల గురించి మాట్లాడాన్ని కొందరు నేరంగా చేశారని.. కానీ తాము మాత్రం ఆవులను తల్లిగా (Cows As Mothers) గౌరవిస్తామని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న మోదీ ఈ రకంగా ప్రతిపక్షాల మాటల దాడిని చేశారు. గురువారం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో (Varanasi)  మోదీ.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, మరికొన్నింటి ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆవులు చాలా మందికి తల్లి, పవిత్రమైనవని అన్నారు. ఆవును పాపంగా భావించే కొందరు కోట్లాది మంది ప్రజల జీవనోపాధి పశువులపై ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తించడం లేదన్నారు. 

ఆవులు,  గేదెలపై జోకులు వేసే వారు 8 కోట్ల కుటుంబాల జీవనోపాధి పశుసంపదపై ఆధారపడి ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారని మోదీ అన్నారు. ఈ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. వారి డిక్షనరీలో "మాఫియావాద్", "పరివార్వాద్" ఉన్నాయని విమర్శంచారు. కానీ తాము సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 

దేశంలో ఆరేండ్ల క్రితంతో పోలిస్తే దాదాపు 45 శాతం పాల ఉత్పత్తి పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ పాల ఉత్పత్తితో భారత్ వాటా 22 శాతంగా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ దేశంలోనే పాలను ఉత్పత్తి చేసే అతిపెద్ద రాష్ట్రంగా మాత్రమే కాకుండా.. డెయిరీ రంగ విస్తరణలో కూడా చాలా ముందుందని ప్రధాని అన్నారు. ‘దేశంలో శ్వేత విప్లవంలో కొత్త శక్తి.. పాడి పరిశ్రమ, పశుసంవర్ధక రంగం రైతుల స్థితిగతులను మార్చడంలో పెద్ద పాత్ర పోషిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. పశుపోషణ అనేది చిన్న రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారగలదు. దేశంలో వారి సంఖయ 10 కోట్లకు పైగానే ఉంది. భారతదేశంలోని పాల ఉత్పత్తులు భారీ విదేశీ మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. మనం వృద్ధి చెందడానికి చాలా అవకాశాలను కలిగి ఉన్నాం’ అని మోదీ అన్నారు. 


ఇక,  10 రోజుల వ్యవధిలోవారణాసిలో మోదీ పర్యటించడం ఇది రెండోసారి. గురువారం ఉదయం వారణాసికి చేరుకున్న మోదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి ప్రాధికార సంస్థ ఫుడ్ పార్క్, కర్ఖియోన్‌లో బనాస్ డెయిరీ సంకుల్‌కు శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ డెయిరీని సుమారు రూ. 475 కోట్లతో నిర్మించనున్నారు. రోజుకు దాదాపు 5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తారని అధికారులు తెలిపారు. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఆ ప్రాంత రైతులకు కొత్త అవకాశాలను కల్పించడానికి తోడ్పడుతుందని వారు తెలిపారు.

బనాస్ డెయిరీకి సంబంధించిన  1.7 లక్షల మందికి పైగా పాల ఉత్పత్తిదారుల బ్యాంకు ఖాతాలకు దాదాపు రూ. 35 కోట్ల బోనస్‌ను కూడా ప్రధాని డిజిటల్‌గా బదిలీ చేశారు. వారణాసిలోని రాంనగర్‌లో మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ యూనియన్ ప్లాంట్ కోసం బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు కూడా మోదీ శంకుస్థాపన చేశారు.
 

click me!