
బెంగళూరు: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని, కేవలం ప్రతిపక్షాలను లక్ష్యం చేసుకోవడానికి ఒక ఆయుధంగా వాడుతున్నదని కాంగ్రెస్ ధర్నాకు దిగింది. సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేసింది. ఇందులో భాగంగానే కర్ణాటక కాంగ్రెస్ కూడా బహిరంగ ప్రదర్శన చేపట్టింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పార్టీని సమస్యల ఉచ్చులోకి తోసేసింది.
జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల పేరుతో తాము వచ్చే మూడు నుంచి నాలుగు తరాలకు సరిపడా డబ్బులు పోగుచేసుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ అన్నారు. ఇప్పుడు తాము ఈ మాత్రం కూడా త్యాగం చేయకుంటే.. తినే తిండిలోనూ పురుగులు పడుతాయేమోనని భయం పుడుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేయడానికి ఒక ఆయుధంగా పనికి వస్తాయనడంలో సందేహం లేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కే ట్విట్టర్ వేదికగా.. ఆయనపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలన ఎప్పడు చూడనంతా స్పష్టంగా వెల్లడించాడని మంత్రి సుధాకర్ కే తెలిపారు.
గతంలో రేప్‌కు సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. అప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.