నరబలి కేసులో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు.. ముక్కలుగా నరికి.. శరీరలను ఉడికించుకుని తిన్న నిందితులు

By Mahesh KFirst Published Oct 12, 2022, 1:46 PM IST
Highlights

కేరళలో నరబలి ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను డబ్బు కోసం బలి ఇచ్చారు. అనంతరం, వారి కొన్ని బాడీ పార్టులనూ ఉడికించుకుని తిన్నారని నిందితులు చెప్పడం కలకలం రేపుతున్నది.
 

తిరువనంతపురం: కేరళలో వెలుగుచూసిన నరబలి కేసు కలకలం రేపింది. ఆర్థిక సంపత్తి కోసం ఇద్దరు మహిళల(రోస్లిన్, పద్మ)ను అత్యంత క్రూరంగా బలి ఇచ్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. రోస్లిన్ శరీరాన్ని 56 ముక్కలుగా, పద్మ శరీరాన్ని 5 ముక్కలుగా కట్ చేసినట్టు తెలిసింది. అంతేకాదు, వారిని చంపిన తర్వాత ఉడికించుకుని తిన్నామని నిందితులు చెప్పడం దిగ్భ్రాంతికరంగా మారింది.

కేరళలోని పతానంతిట్ట జిల్లా ఎలంథూర్ గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ఈ కేసులో దంపతులు భగవాల్ సింగ్, లైలాలు అరెస్టయ్యారు. వీరిద్దరూ తిరువల్ల వాసులు. కాగా, రెస్లీ, పద్మలను వంచించి బలివ్వడానికి తెచ్చినట్టుగా భావిస్తున్న మహమ్మద్ షఫీని అరెస్టు చేశారు.

Also Read: దారుణం : కేరళలో ఇద్దరు మహిళల నరబలి, ముగ్గురి అరెస్ట్..

పోలీసులకు నిందితురాలు లైలా కీలక విషయాలు దర్యాప్తులో వెల్లడించారు. ధనం రావాలంటే నరబలి ఇవ్వాలని చెప్పిన వ్యక్తిని షఫీగా పేర్కొంది. ఆ షఫీ చెప్పిన సూచనల మేరకు చంపేసిన వారి బాడీ పార్టులనూ ఉడికించుకుని తిన్నట్టు వివరించింది. ఈ నరబలి జరుగుతుండగా వారు ఓ పుస్తకంలోని మంత్రాలనూ చదువినిట్టు తెలిపింది. ఈ మేరకు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో నిందితులను ఎర్నాకుళం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారికి 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది. నిందితులను విచారించడానికి కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌కు కోర్టు సమ్మతించింది. 

ఇదిలా ఉండగా, సీఎం పినరయి విజయన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ కేసు త్వరితగతిన విచారించాలని ఆదేశించారు. నరబలి రాకెట్ గుట్టు విప్పాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కడైనా జరిగాయా? జరుగుతున్నాయా? వంటి విషయాలనూ దర్యాప్తు చేయాలని సూచించారు. నరబలి రాకెట్ మీద పూర్థి స్థాయిలో విచారించాలని ఆదేశించారు.

click me!