
Mamata Banerjee: సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో.. ఐదింట బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ప్రధానంగా.. ఉత్తరప్రదేశ్ లో మరోసారి భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ.. మరోసారి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ విజయం సాధించడంతో గత రికార్డులు బద్దలయ్యాయి. అలాగే, ఉత్తరఖండ్, మణిపూర్, గోవాల్లో బీజేపీ అధికారం చేజిక్కిచుకుంది.
ఈ ఎన్నికల ఫలితాలపై పశ్చిమ్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై 2024లో బీజేపీని పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందనీ మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఇంకా ఆలోచిస్తే, కాంగ్రెస్ కోసం చూస్తే కూర్చుంటే.. ఏం లాభం లేదన్నారు. కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేసినా.. ఓటమి పాలవుతోందనీ, గెలుస్తామన్న ఆశ కూడా ఆ పార్టీ నాయకులు లేదనీ, పార్టీ ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ కోసం వేచి చూడటం వల్ల ఏలాంటి ప్రయోజనం, అర్థం లేదని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ కోరుకుంటే కలసి పనిచేసేందుకు సిద్ధమేనన్నారు.
బెంగాల్ అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం, ఓటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈవీఎంల చోరీ చోటుచేసుకుందంటూ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలను ఆమె బలపరిచారు. అఖిలేష్ ఎంత మాత్రం అధైర్యపడకుండా, ఈవీఎంలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలని కోరాలని మమతా సలహా ఇచ్చారు. 2017 ఎన్నికలతో పోల్చితే ఎస్పీ ఓట్ల శాతం 20 శాతం నుంచి 37 శాతానికి పెరిగిందని అన్నారు.
ఇదే మంచి సమయం.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్ష కూటమిగా ఏర్పడి, పోరాటం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కోరుకుంటే మనమందరం కలిసి పోరాడవచ్చు.. ప్రస్తుతానికి దూకుడుగా ఉండకండి.. సానుకూలంగా తీసుకోంది.. ఈ గెలుపు (4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు) బీజేపీకి పెద్ద నష్టం’’ అని వ్యాఖ్యానించారు.
అలాగే.. 2022 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 లోకసభ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తాయనే ప్రధాని మోడీ వ్యాఖ్యలను మమతా బెనర్జీ తోసి పుచ్చారు. అలా జరగడం అసాధ్యమని, బీజేపీ కలలు కనడం మానుకోవాలని హితవు పలికింది. కొన్ని సీట్లు గెలుచుకొని గొంతు పెంచి మాట్లాడుతున్నారని, ఈ విజయం నిజమైన ప్రజాతీర్పు కాదనీ, ఓట్లను లూటీ చేసేందుకు ఎన్నికల వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్ల సాధించుకున్న విజయమిదనీ మమత విమర్శించారు.