ఛీ..మహిళల టాయిలెట్లోకి వెళ్లి.. వీడియోలు తీస్తూ పాడుపని.. ఒకరు అరెస్ట్..

By AN TeluguFirst Published Sep 1, 2021, 9:37 AM IST
Highlights

ఒక మహిళ వాష్‌రూమ్‌ను ఉపయోగించడానికి వెళ్లింది. అయితే పక్కనే ఉన్న క్యూబికల్ పై నుండి ఎవరో ఫోన్ తో తనను రికార్డ్ చేస్తున్నట్లు గమనించింది. వెంటనే ఆ మహిళ గట్టిగా అరుస్తూ బైటికి పరిగెత్తుకొచ్చింది. పక్క క్యూబికల్ మీద గట్టిగా కొడుతూ అరవడం మొదలు పెట్టింది. 

కోల్‌కతా : నగరంలోని న్యూ టౌన్‌లోని ప్రముఖ షాపింగ్ మాల్‌లో దారుణం వెలుగు చూసింది. ఆడవాళ్ల టాయిలెట్ లోకి చొరబడిని ఓ వ్యక్తి వీడియోలు తీస్తూ పట్టు బడ్డాడు. షాపింగ్ మాల్ లో పనిచేసే ఓ 30 ఏళ్ల మహిళా స్వీపర్ వాష్ రూంలోకి వెళ్లినప్పుడు.. ఈ ఘటన జరిగింది.  ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటన ఆదివారం రాత్రి యాక్సిస్ మాల్‌లో జరిగింది. ఒక మహిళ వాష్‌రూమ్‌ను ఉపయోగించడానికి వెళ్లింది. అయితే పక్కనే ఉన్న క్యూబికల్ పై నుండి ఎవరో ఫోన్ తో తనను రికార్డ్ చేస్తున్నట్లు గమనించింది. వెంటనే ఆ మహిళ గట్టిగా అరుస్తూ బైటికి పరిగెత్తుకొచ్చింది. పక్క క్యూబికల్ మీద గట్టిగా కొడుతూ అరవడం మొదలు పెట్టింది. లోపలినుంచి గడియపెట్టుకున్న ఆ వ్యక్తి.. కాసేపటికి తలుపుతీసి మహిళను బలంగా తోసేసి.. మాల్ నుంచి పారిపోయాడు. 

న్యూ టౌన్‌లోని సిఇ బ్లాక్‌లో ఉండే ఆ మహిళ మొదట మాల్ యాజమాన్యానికి ఈ విషయాన్ని తెలిపి.. ఆ తరువాత న్యూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
"ఈ సంఘటన ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. మేం మాల్‌కు వెళ్లే సమయానికి, చాలామంది ఉద్యోగులు వెళ్లిపోయారు. దీంతో.. సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేసి, ఆ వ్యక్తిని కనిపెట్టాం. తెల్లారి ఉదయం.. అతని వివరాలు మాల్ అధికారులకు చెప్పి.. ఆఫీసుకు వచ్చేలా ప్లాన్ చేశాం. అలా వచ్చిన నిందితుడిని అరెస్ట్ చేశాం”అని బిధన్నగర్ కమిషనరేట్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

పోలీసుల విచారణలో మొదట సదరు వ్యక్తి..  మహిళ లోపలుందన్న విషయం తెలియక బాత్రూం క్లీన్ చేద్దామని లోపలికి వెళ్లానని చెప్పాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో మహిళల వీడియోలు, ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని... పోలీసులు ఫోన్ గ్యాలరీలో మొత్తం చెక్ చేశారు. 

ఈ సంఘటనకు తాము క్షమాపణలు కోరుతున్నామని, అవసరమైన అన్ని రకాల సహకారం పోలీసులకు అందిస్తున్నామని యాక్సిస్ మాల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "మేం పోలీసులు అడిగిన సీసీ టీవీ ఫుటేజీని ఇప్పటికే ఇచ్చాం. సదరు వ్యక్తి సమాచారాన్ని కూడా ఇచ్చేశాం. ఆ వ్యక్తి మాల్ లో డైరెక్ట్ ఉద్యోగి కాదు. థార్డ్ పార్టా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మాల్ లో ఉద్యోగంలో చేరాడు ”అని అధికారి చెప్పారు.

నేరానికి పాల్పడిన ఈ వ్యక్తి సోనార్‌పూర్‌ కు చెందిన గౌతం మొండల్ (30) గా పోలీసులు గుర్తించారు. అతడిపై ఐపిసి సెక్షన్లు 354 సి (వాయురిజం), 354 డి (స్టాకింగ్) 323 (వాలెంటరీగా హాని కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. అతడిని బ్యారక్‌పూర్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అతడిని గుర్తించడానికి రెండుమూడు రోజుల్లో డమ్మీ క్యాండెట్లతో కలిపి పెరేడ్ పెడతామని.. మహిళను పిలుస్తామని తెలిపారు. 

ఇలాంటి సంఘటనలు పెద్ద పెద్ద మాల్స్, షాపింగ్ కాంప్లెక్సుల్లో మహిళలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. 2015 లో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గోవాలోని ఓ గార్మెంట్ షాప్ లోని ట్రయల్ రూమ్‌లో సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నట్టు గుర్తించారు. నిరుడు నోయిడా షాపింగ్ మాల్‌లోని ఒక బట్టల షాప్ లో 21 ఏళ్ల హౌస్ కీపింగ్ సిబ్బంది.. ఒక మహిళ బట్టలు మార్చుకుంటుండగా ట్రయల్ రూమ్‌లోకి చొచ్చుకెళ్లినందుకు అతన్ని అరెస్టు చేశారు.

click me!