జాతీయ భద్రత పేరుతో పౌరుల గొంతుకను అణిచివేయ‌లేము.. కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Published : Apr 05, 2023, 12:55 PM IST
జాతీయ భద్రత పేరుతో పౌరుల గొంతుకను అణిచివేయ‌లేము.. కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

సారాంశం

New Delhi: మలయాళ వార్తా ఛానెల్ మీడియా వన్ ప్రసార అనుమతులను నాలుగు వారాల్లో పునరుద్ధరించాలని బుధ‌వారం (ఏప్రిల్ 5న) సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ ప్రసార నిషేధం విధించడంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.  

Supreme Court: జాతీయ భద్రతను ఉటంకిస్తూ దేశ పౌరుల హక్కులను కాలరాయడానికి వీల్లేదని పేర్కొంటూ మలయాళ న్యూస్ ఛానెళ్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఓ మలయాళ న్యూస్ ఛానల్ దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్ లో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రత పేరుతో పౌరుల గొంతుకను అణిచివేయ‌లేమని పేర్కొంటూ కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్య‌క్తం చేసింది. మలయాళ వార్తా ఛానెల్ మీడియా వన్ ప్రసార అనుమతులను నాలుగు వారాల్లో పునరుద్ధరించాలని బుధ‌వారం (ఏప్రిల్ 5న) సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ ప్రసార నిషేధం విధించడంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

ఛానల్ పై నిషేధం వెనుక జాతీయ భద్రత ఉందన్న కేంద్ర ప్రభుత్వ వాదనను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు జాతీయ భద్రతకు సంబంధించిన వాదనలు గాల్లో మాట‌ల‌ను ప‌రిగ‌ణించ‌లేమ‌నీ, దీనికి మద్దతుగా బలమైన సాక్ష్యాధారాలు ఉండాలని పేర్కొంది. 'పౌరుల హక్కులను కాలరాయడానికి ప్రభుత్వం జాతీయ భద్రత అభ్యర్థనను ఉపయోగిస్తోంది. చట్టపరంగా ఈ  వైఖరి తప్పు' అని సీజేఐ పేర్కొన్నారు.

ఇంతకీ మొత్తం వ్యవహారం ఏంటి?

మీడియా వన్ టీవీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ నిరాకరించింది. ఆ తరువాత సమాచార అండ్ ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ఛానల్ ప్రసార లైసెన్స్ ను పునరుద్ధరించడానికి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కంపెనీ ఫిబ్రవరి 9న కేరళ హైకోర్టులో సింగిల్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయగా, కేరళ హైకోర్టు కొట్టివేసింది. 

దీంతో ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది సీల్డ్ కవర్ లో తన వాదనను కోర్టుకు వినిపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు సీల్డ్ కవర్ లో మీ సమాధానాన్ని ఇవ్వడం పిటిషనర్ ను చీకట్లో పోరాడేలా వదిలేయడమేనని, సహజ న్యాయ సూత్రానికి కూడా విరుద్ధమని వ్యాఖ్యానించింది. 

కేంద్ర ప్రభుత్వ నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు.. "బలమైన ప్రజాస్వామ్యం కోసం, స్వేచ్ఛాయుత, నిర్భయమైన పత్రికలు ఉండటం చాలా ముఖ్యం" అని పేర్కొంది. అలాగే, "ప్రజాస్వామ్యానికి ఇండిపెండెంట్ ప్రెస్ ఎంతో అవసరమన్నారు. అధికారంతో నిజం మాట్లాడే హక్కు పత్రికారంగంలోని ప్రతి విభాగం కర్తవ్యం. మీడియా వన్ ప్రసారం చేసిన విమర్శనాత్మక అభిప్రాయాలను దేశ వ్యతిరేకమైనవిగా పేర్కొనలేము. ప్రసార నిషేధం భావ ప్రకటనా స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపింది" అని  సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?