గుజరాత్ అల్లర్లు: అద్వానీతో వాజ్ పేయి విభేదించిన వేళ

By pratap reddyFirst Published Aug 17, 2018, 11:55 AM IST
Highlights

గుజరాత్ అల్లర్ల విషయంలో అటల్ బిహారీ వాజ్ పేయి తన చిరకాల మిత్రుడు ఎల్కే అద్వానీతో విభేదించారు. గుజరాత్ హింసపై వాజ్ పేయి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేత రాజీనామా చేయించాలని అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల విషయంలో అటల్ బిహారీ వాజ్ పేయి తన చిరకాల మిత్రుడు ఎల్కే అద్వానీతో విభేదించారు. గుజరాత్ హింసపై వాజ్ పేయి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేత రాజీనామా చేయించాలని అభిప్రాయపడ్డారు. అయితే, అద్వానీ అందుకు విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

గోధ్రా, గుజరాత్‌ అల్లర్లకు నైతిక బాధ్యత వహించి సీఎం నరేంద్రమోదీ రాజీనామా చేయాలని వాజ్ పేయి అభిప్రాయపడ్డారు. మారణకాండ వెనుక మోదీ వైఫల్యం లేదని,  పైగా రాజీనామా చేస్తే గుజరాత్‌లో అరాచకం ప్రబలుతుందని అద్వానీ అభిప్రాయపడ్డారు. 

ఈ విషయాన్ని స్వయంగా తన ఆత్మకథ "నా దేశం- నా జీవితం"లో అద్వానీ రాశారు. ఏడాది క్రితమే సీఎం అయిన నరేంద్రమోదీని ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో బలిపశువుగా చేయడం సమంజసం కాదని, అలా చేయడం వల్ల గుజరాత్‌లో సామాజిక సమైక్యత దెబ్బతింటుందని తాను భావించినట్లు అద్వానీ అన్నారు. 
 
2002 ఏప్రిల్‌ రెండో వారంలో గోవాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, గోవాకు తనతో పాటు రావాల్సిందిగా అటల్‌జీ తనను కోరారని. న్యూఢిల్లీ నుంచి పానాజీకి బయలుదేరిన ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి ప్రత్యేక కేబిన్‌లో  తమతో పాటు విదేశాంగమంత్రి జస్వంత్‌ సింగ్‌, కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రి అరుణ్‌శౌరీ కూడా ఉన్నారని చెప్పారు. 

అయితే, తాను మోడీ రాజీనామా చేయాలనే వాజ్ పేయి ప్రతిపాదనను వ్యతిరేకించానని, అయినప్పటికీ పానాజీ వెళ్లిన తర్వాత మోడీని పిలిచి రాజీనామా చేస్తానని వాజ్ పేయితో చెప్పాలని సూచించానని, అందుకు మోడీ అంగీకరించారని అద్వానీ వివరించారు. 
 
ఒక ప్రభుత్వాధినేతగా తాను రాజీనామా చేస్తానని మోడీ ప్రకటించిన వెంటనే రాజీనామా వద్దనే నినాదాలతో సభా ప్రాంగణం దద్ధరిల్లిందని ఆయన చెప్పారు. 

click me!