
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా పేరును ప్రకటించారు. తాను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఈ రోజు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. తాను తీసిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని హత్తుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గత నాలుగేళ్లుగా ది కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం అహోరాత్రులు శ్రమించామని వివరించారు. కశ్మీరీ హిందువులపై జరిగిన నరమేధం, వారికి జరిగిన అన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యం అని పేర్కొన్నారు. ఇక
కొత్త సినిమా కోసం పని చేయడానికి సమయం ఆసన్నమైందని వివరించారు. ఈ ట్వీట్ అనంతరం మరో ట్వీట్ చేస్తూ కొత్త సినిమా పేరును ప్రకటించారు. ది ఢిల్లీ ఫైల్స్ అని తన కొత్త సినిమా పేరును వెల్లడించారు.
వివేక్ అగ్నిహోత్రి గతంలో పలు సినిమాలు తీశాడు. చాకోలేట్, హేట్ స్టోరీ, జిద్ వంటి కొన్ని సినిమాలు ఆయన తీసినవే. కానీ, ఆయన తీసిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మాత్రం దేశవ్యాప్తంగా చర్చను లేవదీసింది. 1990ల్లో జమ్ము కశ్మీర్ నుంచి కశ్మీరీల వలసల గురించి కశ్మీర్ ఫైల్స్ సినిమా చర్చిస్తుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా మార్చి 11న విడుదల అయింది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, మిథున్ చక్రబోర్తి, దర్శన్ కుమార్‌లు నటించారు.
ఈ సినిమా రాజకీయంగా చర్చనీయాంశమైంది. కొంత మంది విమర్శకులు, రచయితులు ఈ సినిమాపై కఠిన విమర్శలు చేశారు. అయినప్పటికీ బాక్సాఫీసు దగ్గర ఈ ఫిలిమ్ సుమారు 330 కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమాపై బీజేపీ ప్రశంసలు కురిపించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఎంటర్‌టైన్‌మెంట్ పన్ను ఎత్తేశాయి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. బాలీవుడ్ మూవీ ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ నేతలు అందరూ ఈ సినిమా పోస్టర్లు వేయడంలో బిజీ అయ్యారని ఆరోపించారు. మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఈ సినిమాపై ట్యాక్స్ ఎత్తేస్తూ నిర్ణయాలు తీసుకున్నాయని తెలిపారు. ‘అసలు వీళ్లు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ప్రజల సంక్షేమం కోసం, వారికి సేవలు అందించడానికి వచ్చారా? లేక సినిమా పోస్టర్లు వేయడానికి వచ్చారా?’ అని ప్రశ్నించారు.
ఎనిమిదేళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ.. కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి నీడలోకి వెళ్లాల్సిన గతి పట్టిందని ఆరోపించారు. అంటే.. ప్రధానిగా నరేంద్ర మోడీ ఏమీ చేయలేదని స్పష్టం అవుతున్నదని పేర్కొన్నారు. ‘అందరు.. బీజేపీ నేతలందరూ కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లు వేస్తున్నారు. ఇది చూస్తే.. వాళ్ల ఇంటిలో పిల్లలు నాన్న మీరేం చేస్తున్నారని అడిగితే.. కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లు వేస్తుంటాం చిన్నా అని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయారు’ అని విమర్శించారు.
ఇక్కడ కూడా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ట్యాక్స్ ఎత్తేయాలని డిమాండ్లు చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఒక వేళ నిజంగా బీజేపీ నేతలకు అంత ఆసక్తి ఉంటే.. ట్యాక్స్ ఫ్రీ ప్రకటించడం ఎందుకు ఏకంగా సినిమాను యూట్యూబ్‌లో వేయమనండి.. అందరూ ఉచితంగా చూడొచ్చు అంటూ పేర్కొన్నారు.