ఇక్కడ వదిలేస్తే నేను బతకలేను.. భయమేస్తుంది నాన్న: వెలుగులోకి విస్మయ ఆడియో క్లిప్

By Sumanth KanukulaFirst Published May 22, 2022, 2:50 PM IST
Highlights

వరకట్న వేధింపులు భరించలేక కేరళలోని కొల్లాంలో గతేడాది జూన్ నెలలో విస్మయ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో కోర్టు తీర్పుకు కొన్ని గంటల ముందు విస్మయపై జరిగిన దాడి గురించి తెలిపే ఓ ఆడియో క్లిప్ ఒక్కటి వెలుగుచూసింది. 

వరకట్న వేధింపులు భరించలేక కేరళలోని కొల్లాంలో గతేడాది జూన్ నెలలో విస్మయ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించి విస్మయ భర్త కిరణ్ కుమార్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని 304 (బి), 498 (ఎ), 306, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వరకట్న నిషేధ చట్టంలోని సంబంధిత సెక్షన్లు కూడా అతనిపై మోపారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను కొల్లాం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు పూర్తి చేసింది. తీర్పును సోమవారం (మే 23)న వెలురించనున్నట్టుగా కోర్టు తెలిపింది. 

అయితే కోర్టు తీర్పుకు కొన్ని గంటల ముందు విస్మయపై జరిగిన దాడి గురించి తెలిపే ఓ ఆడియో క్లిప్ ఒక్కటి వెలుగుచూసింది. ఆ ఆడియో క్లిప్.. విస్మయకు, ఆమె తండ్రి త్రివిక్రమన్ నాయర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. అందులో విస్మయ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తాను ఎదుర్కొన్న హింస గురించి తన తండ్రి వద్ద ప్రస్తావించారు. తన భర్త కిరణ్ దాడి చేస్తున్నాడని.. భయంగా ఉందని విస్మయ పేర్కొన్నారు. కిరణ్ తనను దారుణంగా కొడుతున్నారని, అవమానిస్తున్నారని ఏడుస్తూ తన తండ్రికి చెప్పారు. ఇక కిరణ్‌తో కలిసి బతకలేనని, ఈ వేధింపులు భరించలేనని తెలిపారు. తనను కిరణ్ ఇంట్లో నుంచి తీసుకెళ్లాలని తండ్రిని కోరారు. చాలా భయంగా ఉందని చెప్పారు. 

‘‘నన్ను ఇక్కడ వదిలేస్తే నేను బతకలేను. నేను ఇంటికి తిరిగి రావాలి. కిరణ్ కుమార్ నాపై దాడి చేస్తున్నాడు. నాకు భయంగా ఉంది. నేను ఏదో ఒకటి చేస్తాను’’ అని విస్మయ తన తండ్రితో చెప్పారు. ఇక, విస్మయ చిత్రహింసలు ఎదుర్కొంటోందని గ్రహించే సమయానికి చాలా ఆలస్యం అయిందని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 

విస్మయ ఆయుర్వేద వైద్య విద్యార్థిని. ఆమెకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కిరణ్‌తో వివాహం జరిగింది. అయితే గతేడాది జూన్ 21న విస్మయ.. విస్మయ కొల్లాం జిల్లా శాస్తంకోటలో తన భర్త ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని మృతి చెందింది. ఆ తర్వాత ఈ కేసులో కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విస్మయ తండ్రి, సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణ జనవరి 10న ప్రారంభమైంది. కిరణ్ వరకట్నం డిమాండ్ చేస్తూ విస్మయను నిత్యం వేధించేవాడని ప్రాసిక్యూషన్ కోర్టు ముందు వాదించింది. 

విస్మయ తల్లి, స్నేహితురాలు, కిరణ్ సోదరికి పంపిన వాట్సాప్ సందేశాలను కూడా ప్రాసిక్యూషన్ కోర్టుకు అందజేసింది. విచారణ సందర్భంగా, ప్రాసిక్యూషన్ 41 మంది సాక్షులను క్రాస్ ఎగ్జామినేట్ చేసింది, 118 డాక్యుమెంట్లు మరియు 12 అఫిడవిట్లను సమర్పించింది. అయితే ఫోన్ సంభాషణలు, సందేశాలను సాక్ష్యంగా తీసుకోలేమని నిందితుడు వాదించాడు. వీటిని పరిగణలోకి తీసుకన్న కోర్టు.. మే 23న తీర్పు వెలువరించనుంది. ఇక, శాఖాపరమైన విచారణ అనంతరం రవాణా శాఖలో పనిచేస్తున్న కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు.

విస్మయ భర్త కిరణ్ కుమార్‌ను కోర్టు శిక్షిస్తుందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆశిస్తున్నారు. వరకట్నం పేరుతో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు వ్యతిరేకంగా సానుకూల తీర్పు వెలువడుతుందని భావిస్తున్నట్టుగా విస్మయ తండ్రి చెప్పారు. 

click me!