జనాభా నియంత్రణ చట్టం, ఉమ్మడి పౌర స్మృతి తీసుకురండి: ప్రధానికి రాజ్ ఠాక్రే విజ్ఞప్తి

By Mahesh KFirst Published May 22, 2022, 2:28 PM IST
Highlights

జనాభా నియంత్రణ చట్టం, ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకురావాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే.. ప్రధానమంత్రిని కోరారు. ఆయన ఈ రోజు పూణెలో ఎంఎన్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ఓ పబ్లిక్ ర్యాలీలో మాట్లాడారు. ఈ సందర్బంగానే ఔరంగబాద్ పేరును శంభాజీ నగర్‌గా మార్చాలనీ పీఎంను కోరారు.

ముంబయి: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు సంధిస్తూనే కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. ఆయన మే 22న పూణెలో ఓ పబ్లిక్ ర్యాలీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీకి విజ్ఞప్తులు చేశారు. వీలైనంత త్వరగా ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తేవాలని ఆయన ప్రధానిని కోరారు. అదే విధంగా జనాభా నియంత్రణ చట్టాన్ని తేవాలని, ఔరంగాబాద్‌ పేరును శంభాజీ నగర్‌గా మార్చాలని మనవి చేశారు.

ఈ ర్యాలీలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలను ఉద్దేశిస్తూ మహారాష్ట్రలోని మహావికాస్ అఘాది ప్రభుత్వాన్ని విమర్శించారు. ఔరంగాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఏఐఎంఐఎం పార్టీ గెలుచుకుపోవడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ రెక్కలు చాచడానికి అధికార పార్టీనే కారణం అని వివరించారు. ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్.. శివసేన అభ్యర్థి చంద్రకాంత్ ఖైరేను ఓడించి ఔరంగాబాద్ ఎంపీగా గెలుపొందడం దిగ్భ్రాంతికరం అని పేర్కొన్నారు.

మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను చంపడానికి వచ్చిన ముఘల్ పాలకుడు ఔరంగజేబ్ సమాధికి పూలతో నివాళి అర్పించడానికి ఆ ఎంఐఎం ఎంపీ వెళ్లాడని, ఆ తర్వాత మహారాష్ట్ర ఉడికిపోతుందని భావించానని చెప్పారు. కానీ, ఎవరూ నోరు మెదపలేదని ఆగ్రహించారు. శరద్ పవార్ సాహెబ్ మాత్రం ఔరంగజేబు ఇక్కడకు కేవలం రాజ్యవిస్తరణ కోసం వచ్చాడని సెలవిచ్చాడని పేర్కొన్నారు.

ఈ ర్యాలీలోనే తాను అయోధ్య టూర్‌ను రద్దు చేసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. తన హిప్ బోన్ జాయింట్ రిప్లేస్‌మెంట్ చేసుకోవాల్సి ఉన్నదని, అందుకే ఈ అయోధ్య టూర్‌ను వాయిదా వేసుకుంటున్నట్టు వివరించారు. ఈ విషయాన్ని తాను స్పష్టం చేయదలుచుకున్నానని, మీడియా దుష్ప్రచారం చేయకముందే ఈ ప్రకటన చేస్తున్నానని తెలిపారు.

మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే తన అయోధ్య పర్యటనను వాయిదా వేసుకున్న నేప‌థ్యంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ఎంఎన్ఎస్ చీఫ్ ను త‌న రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఈ విష‌యాన్ని ఆయ‌న అర్థం చేసుకోవాల‌ని సూచించారు. 

‘‘ రాజ్ ఠాక్రేను బీజేపీ వాడుకుంటోది. కొంతమంది దీనిని ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. కానీ ఈ విషయాన్ని ఆయ‌న పరిగణలోకి తీసుకోవాలి ’’ అని సూచించారు. రాముడి దర్శనం కోసం ఎవరైనా అయోధ్యకు వెళ్లవచ్చని సంజయ్ రౌత్ అన్నారు. ‘‘ మీరు కేవలం మీ హృదయంలో నమ్మకం కలిగి ఉండాలి. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. రాజ్ ఠాక్రే తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఎంపీ బ్రిజ్మోహన్ సింగ్ కొన్ని ప్రశ్నలు సంధించారు. బహుశా ఆయ‌న‌కు స‌మాధానం దొర‌క‌లేదు. అయితే జూన్ 15న ఆదిత్య ఠాక్రే పలువురు శివసైనికులతో కలిసి అయోధ్య దర్శనానికి వెళ్తున్నారు. తత్వశాస్త్రం రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. దీనికి ముందు కూడా ఉద్ధవ్ ఆల‌యాన్ని సందర్శించారు. అది కొనసాగుతుంది. గుడి కోసం ఉద్యమం మొదలైనప్పటి నుంచి అయోధ్యతో శివసేనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ’’ అని ఆయన అన్నారు.

click me!