విరాట్ కోహ్లీ, తమన్నాలకు చిక్కులు: ఆన్ లైన్ గేమింగ్ లపై పిటిషన్

By telugu teamFirst Published Aug 1, 2020, 7:00 AM IST
Highlights

ఆన్ లైన్ గేమింగ్ లు చట్ట విరుద్ధమని పేర్కొంటూ వాటికి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీని, తమన్నాను అరెస్టు చేయాలని ఓ న్యాయవాది డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చిక్కుల్లో పడేసింది. దేశ చట్టాల ప్రకారం గ్యాంబ్లింగ్ నేరమని ఆరోపిస్తూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఆ పిటిషన్ దాఖలు చేశాడు. ఆన్ లైన్ గేమ్ లు ఆడి భారీగా నష్టపోయిన గ్యాంబ్లర్లు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు తమిళనాడులో పెరిగాయని అంటూ సూర్యప్రకాశం అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. 

ఆన్ లైన్ గేమింగ్ లకు ప్రచారకర్తలుగా ఉన్న విరాట్ కోహ్లీని, సినీ నటి తమన్నాను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్యాంబ్లింగ్ శిక్షార్హమైన నేరమని, ఆన్ లైన్ గేమ్ ల నిర్వాహకులు భారీగా డబ్బు బోనస్ గా ప్రకటిస్తుండడంతో యువత దాని బారిన పడుతున్నారని ఆయన అన్నారు. 

క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి తమన్నా భాటియా, ఇతర సినీ ప్రముఖులు ఆన్ లైన్ గేమ్ లు ఆడాల్సిందిగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్యాంబ్లింగ్ సమాజానికి ప్రమాదకరమని, జీవించే హక్కును కాలరాస్తున్న ఈ గేమింగ్ రాజ్యాంగంలోని 21వ అధికరణకు విరుద్ధమని ఆయన అన్నారు. 

అందువల్ల ఆ గేమింగ్ లను నిషేధించాలని, ఆ సైట్ల నిర్వాహకులను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలని ఆయన కోరారు. చెన్నైకి చెందిన 19 ఏళ్ల విద్యార్థి ఇటీవల ఆత్మహత్య చేసుకుంటూ గ్యాంబ్లింగ్ కు బానిసై తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు చెప్పాడని ఆయన గుర్తు చేశారు. ఈ పిటిషన్ ను మద్రాసు హైకోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉందని అంటున్నారు.

click me!