జేఎన్‌యూలో ఉద్రిక్తత.. ఎన్నికల్లో ఓడిపోయిన బాధలో గెలిచిన వారితో బాహాబాహీ

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 10:13 AM IST
Highlights

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎన్నికల్లో గెలిచిన వామపక్ష కూటమిలోని ఆల్‌ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ), ఓటమి పాలైన ఏబీవీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎన్నికల్లో గెలిచిన వామపక్ష కూటమిలోని ఆల్‌ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ), ఓటమి పాలైన ఏబీవీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

క్యాంపస్ ఆవరణలోని గంగా దాబా వద్ద ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ ఆధ్వర్యంలో తమపై దాడి చేశారంటూ విద్యార్థి సంఘం కొత్త అధ్యక్షుడు సాయి బాలాజీ, మాజీ అధ్యక్షురాలు గీతాకుమారి వసంత్‌కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎన్నికల అనంతరం హాస్టల్‌ గదుల్లో ఉన్న తమ మద్ధతుదారులను వామపక్షాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా కొట్టారంటూ ఏబీవీపీ నేతలు ప్రతిగా ఫిర్యాదు చేశారు.

ఏబీవీపీ నేతల నుంచి తనకు ప్రాణహానీ ఉందంటూ సాయి బాలాజీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో క్యాంపస్‌కు, వసంత్‌కుంజ్ పీఎస్‌కు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జేఎన్‌యూలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

జేఎన్‌యూ విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఐక్య వామపక్ష కూటమి జయకేతనం ఎగురవేసింది. ఈ కూటమికి చెందిన హైదరాబాద్ ఏఐఎస్ఎఫ్ నాయకుడు, రీసెర్చ్ స్కాలర్ ఎన్.సాయిబాలాజీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తెలుగు విద్యార్థి

click me!