ఐఆర్ సీటీసీ కుంభకోణంలో లాలూ ఫ్యామిలీకి సమన్లు

By rajesh yFirst Published Sep 17, 2018, 8:39 PM IST
Highlights

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి, తనయుడు తేజస్వి యాదవ్‌లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. 

ఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి, తనయుడు తేజస్వి యాదవ్‌లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులంతా అక్టోబర్ 6న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తుండటంతో ఆయనకు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. 
 
లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వేమంత్రిగా పనిచేసినప్పుడు 2005లో రాంచీ, పురీలో ఉన్న రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ ఆరోపించింది. అందుకు ఐఆర్ సీటీసీ అధికారులు, లాలూ ప్రసాద్ యాదవ్ తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపించింది. సబ్ లీజ్ రైల్ ను ఇచ్చినందుకు బదులుగా పట్నాలోని ఓ స్థలాన్ని డిలైట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదిలి చేశారని తెలిపింది. అది కూడా చాలా తక్కువ ధరకు అని తెలిపింది. 

ఈ హోటల్ ప్రమోటర్లు లాలు కుటుంబానికి చాలా సన్నిహితులని పేర్కొంది. తర్వాత స్థలం రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ ల పేరు మీదుకు మారిందని అభియోగ పత్రాల్లో ఈడీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నట్టు సీబీఐ స్పష్టం చేసింది. లాలూ కుటుంబ సభ్యులతోపాటు రైల్వే అధికారులపైనా చార్జిషీటు దాఖలు చేసింది. 

అయితే ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును విచారించడానికి ముందు కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించడానికి వారం రోజుల క్రితం కోర్టు కొంత సమయం కావాలని కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీ, తేజస్వీయాదవ్ లకు సమన్లు జారీ చేసింది.

ఈ ఏడాది ఆగష్టు 31న పటియాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు ఒక్కొక్కరు రూ.లక్ష రూపాయలు బాండ్, మరో లక్ష రూపాయలు ష్యూరిటీ  ఇవ్వడంతో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

click me!