పోలీసుల కర్కశత్వం.. రైలు ఢీకొని రెండు కాళ్లు కోల్పోయిన కూరగాయల వ్యాపారి..

By SumaBala BukkaFirst Published Dec 3, 2022, 12:24 PM IST
Highlights

పోలీసుల కర్కశత్వానికి ఓ యువకుడు తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. రైల్వేట్రాక్స్ మీద విసిరేసిన తూకం రాళ్లను తీసుకునే క్రమంలో రైలు ఢీ కొని కాళ్లు కోల్పోయాడు. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కర్కశత్వానికి రోడ్డు మీద కూరగాయల అమ్ముకునే 18 ఏళ్ల కుర్రాడు ట్రైన్ కిందపడి కాళ్లు పోగొట్టుకున్నాడు. పట్టాలపై పడిన తన తరాజును తీసుకునే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఆ తరాజును పోలీసులు పట్టాలమీదికి విసిరేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే...

కాన్పూర్‌లోని రైల్వే స్టేషన్‌కు సమీపంలో కూరగాయలు అమ్ముకునేవారు అక్రమంగా ఫుట్ పాత్ లను ఆక్రమించారు. వీటిని పోలీసులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగిందని సమాచారం. కాన్పూర్‌లోని కళ్యాణ్‌పూర్ ప్రాంతంలోని సాహిబ్ నగర్‌కు చెందిన అర్సలాన్ జిటి రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తుండగా ఇద్దరు పోలీసులు అతని వద్దకు వచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సహజీవనం చేస్తున్న మహిళ ముఖం చిధ్రం చేసి, గొంతుకోసి చంపిన వ్యక్తి.. చిటికెన వేలు నరికి..

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఇద్దరు పోలీసులు అర్సలాన్‌ను కొట్టారు, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ రాకేష్ తూకం కొలిచే రాళ్లను రైల్వే ట్రాక్‌ మీదికి విసిరాడు. దీంతో అర్సలాన్ బెంబేలెత్తిపోయాడు. అవి పోతే తన వ్యాపారం చేసుకోవడం ఎలా అని భయపడ్డాడు. వాటిని తిరిగి తెచ్చుకునేందుకు పట్టాల మీదికి వెళ్లాడు. తూకంరాళ్లను ఏరుతున్న క్రమంలో ట్రైన్ వచ్చే విషయాన్ని గమనించుకోలేదు. బాగా దగ్గరికి వచ్చాక గమనించి పక్కకు తప్పుకునేలోపే రైలు ఢీకొని అతని కాళ్ళు తెగిపోయాయి. స్థానికులు రికార్డ్ చేసిన వీడియోలలో, 18 ఏళ్ల యువకుడు ట్రాక్‌పై పడుకుని సహాయం కోసం ఏడుస్తున్నాడు. ఆ తరువాత ఇద్దరు పోలీసులు అతన్ని తీసుకువెళుతున్నట్లు కనిపిస్తుంది. 

"శుక్రవారం పోలీసులు జీటీ రోడ్డు సమీపంలో ఆక్రమణలను తొలగిస్తుండగా, హెడ్ కానిస్టేబుల్ రాకేష్ బాధ్యతారహితంగా ప్రవర్తించడంతో కూరగాయల విక్రేత అర్సలన్‌ను రైలు ఢీకొట్టింది. రాకేష్ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షులు రికార్డ్ చేసిన సంఘటనకు సంబందించిన వీడియోలు సేకరిస్తున్నారు అని కాన్పూర్‌లోని సీనియర్ పోలీసు అధికారి విజయ్ ధుల్ ఒక ప్రకటనలో తెలిపారు.

click me!