రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని అనిపిస్తోందని రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే అన్నారు. ఆ రాష్ట్రంలోని ఝలావర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Vasundhara Raje : తనకు రాజకీయాలను నుంచి తప్పుకోవాలని అనిపిస్తోందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే మనసులోని మాట బయటపెట్టారు. ఝలావర్-బరన్ కు నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ స్పీచ్ విన్న తరువాత ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఝలావర్ లో శుక్రవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు వసుంధర రాజే, ఆమె కుమారుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుష్యంత్ సింగ్ సభలో మాట్లాడారు. అనంతరం వసుంధర రాజే మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు మాటలు విన్న తరువాత మీరందరూ అతడికి చాలా బాగా శిక్షణ ఇచ్చారనిపిస్తోంది. కాబట్టి ఇక నేను రిటైర్ కావాలని అనుకుంటున్నాను. నేను అతడిని నెట్టాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు.
चढ़ते चुनाव में रिटायरमेंट की बात... माजरा क्या है? 😜 pic.twitter.com/EN9kouwfAr
— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant)
ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఉన్నారని, వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరంతట వారే ప్రజల కోసం పని చేస్తున్నారని తాను భావిస్తున్నానని చెప్పారు. ఇది ఝలావర్ అని ఆమె వ్యాఖ్యానించారు. రోడ్లు, నీటి సరఫరా ప్రాజెక్టులు, వాయు, రైలు కనెక్టివిటీ గురించి ప్రస్తావిస్తూ గత మూడు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పనులను రాజే ప్రస్తావించారు. నేడు ప్రజలు ఝలావర్ ఎక్కడుందని అడుగుతున్నారని, ప్రజలు ఈ ప్రాంతంలో పెట్టుబటులు పెట్టాలని కోరుకుంటున్నారని తెలిపారు.
బీజేపీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలు కృషి చేసినప్పుడే రాజస్థాన్ మళ్లీ నంబర్ వన్ రాష్ట్రంగా మారుతుందని వసుంధర రాజే అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నియామక ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు, నిరుద్యోగం వంటి అంశాలపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజే విరుచుకుపడ్డారు. కాగా.. ఈ నెల 25వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఝలావర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజే నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉన్నాయి.