విప్లవ రచయిత, విరసం నేత వరవర రావుకు బాంబే హైకోర్టులో (bombay high court) ఊరట లభించింది. ఆయన బెయిల్ ను ధర్మాసనం మరికొన్ని రోజులు పొడిగించింది. 2018 భీమా కోరేగావ్ అల్లర్లకు (bhima koregaon case) సంబంధించి ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఆగస్టు 28 నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అయితే, అనారోగ్య కారణాల చేత గతేడాది ఆయన బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ పెట్టుకున్నారు. దీంతో 2021 మార్చి 6న ఆరు నెలల పాటు వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీని ప్రకారం ఆయన ఆగస్టులో సరెండర్ అవ్వాల్సి ఉన్నా బెయిల్‌ను పొడిగించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను ధర్మాసనం ఆమోదించింది.
తాజాగా శుక్రవారం ఆయన సరెండర్ విషయంపై జరిగిన విచారణలో భాగంగా మరోసారి బాంబే హైకోర్టు వరవరరావు బెయిల్‌ను పొడిగించింది. థర్డ్ వేవ్‌లో కేసులు భారీగా పెరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో మళ్లీ ఆయన్ను జైలుకు పంపించలేమని జస్టిస్ ఎస్ఎస్ షిండే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నానాటికి వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని, కరోనా కేసులూ పెరుగుతున్నాయని, ఇలాంటి టైంలో ఆయన్ను జైలుకు పంపించాల్సిన అవసరం ఏముందంటూ ఎన్ఐఏ (nia) అధికారులను ధర్మాసనం ప్రశ్నించింది.
కరోనా థర్డ్ వేవ్ 50 నుంచి 60 రోజులు ఉండే అవకాశం ఉందని, ఇప్పటికే పలువురు ఫ్రంట్ లైన్ వర్కర్లు మహమ్మారి బారిన పడుతున్నారని కోర్టు గుర్తు చేసింది. కరోనా మొదటి వేవ్, రెండోవేవ్‌లో కన్నా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. అయితే వరవర రావుకు కేవలం ఆరు నెలలకు మాత్రమే బెయిల్ ఇచ్చారని, ఇప్పటికే పలుమార్లు ఆయన బెయిల్ ను పొడిగించారని ఎన్ఐఏ తరఫు న్యాయవాది సందేశ్ పాటిల్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఎన్ఐఏ వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. వరవర రావు మెడికల్ బెయిల్ ను ఫిబ్రవరి 5 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఆయన దాఖలు చేసిన శాశ్వత బెయిల్ పిటిషన్ పై ఆ రోజే విచారణ చేస్తామని స్పష్టం చేసింది.
కాగా.. భీమా-కోరెగావ్ కేసులో నిందితురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్ గతేడాది డిసెంబర్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల జైలు జీవితం తరువాత బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యారు సుధా. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ముంబయిలోని జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. ఆమెను ఎల్గార్ పరిషత్-భీమా కోరేగావ్ హింసాకాండ కేసులో 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. భరద్వాజ్‌కు 2021, డిసెంబర్ 1న బాంబే హైకోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 8న ఆంక్షాలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఆదేశాల మేరకు రూ. 50,000 పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.