వీడని ఉత్కంఠ.. మరోసారి వాయిదా జ్ఞాన్‌వాపి తీర్పు ..

Published : Nov 14, 2022, 06:12 PM IST
వీడని ఉత్కంఠ.. మరోసారి వాయిదా జ్ఞాన్‌వాపి తీర్పు ..

సారాంశం

జ్ఞానవాపి కాంపెక్స్ లో బయటపడ్డ శివలింగాన్ని పూజించడానికి అనుమతి కోరుతూ దాఖాలైన పిటిషన్‌పై కోర్టు తీర్పును వాయిదా వేసింది. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) మహేంద్ర పాండే తీర్పును నవంబర్ 17కి వాయిదా వేసినట్లు అసిస్టెంట్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది సులభ్ ప్రకాష్ తెలిపారు.

వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ శివలింగానికి పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు  విచారించింది. మరోసారి వాదనలు విన్న తరువాత కోర్టు తన తీర్పును నవంబర్ 17కి వాయిదా వేసింది. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) మహేంద్ర పాండే తీర్పును నవంబర్ 17కి వాయిదా వేసినట్లు అసిస్టెంట్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది సులభ్ ప్రకాష్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఈ వివాదంపై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అక్టోబర్ 27న దావాపై తన నిర్ణయాన్ని నవంబర్ 8కి రిజర్వ్ చేసింది. అయితే.. నవంబర్ 8న న్యాయమూర్తి సెలవులో ఉన్నందున కేసును సోమవారానికి వాయిదా వేశారు.

జ్ఞాన్‌వాపీ కాంప్లెక్స్‌లోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని, కాంప్లెక్స్‌ను సనాతన్ సంఘ్‌కు అప్పగించాలని, అనుమతి ఇవ్వాలని కోరుతూ మే 24న ఫిర్యాదుదారుడు, విశ్వవేద సనాతన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి కిరణ్ సింగ్ వారణాసి జిల్లా కోర్టులో దావా వేశారు. శివలింగానికి ప్రార్థనలు చేయడానికి అనుమతించాలని కోరారు.ఈ వ్యాజ్యాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తూ మే 25న జిల్లా జడ్జి ఎకె విశ్వేష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యాజ్యంలో వారణాసి జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు కమిషనర్, జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారాలను నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతేజామియా కమిటీ, విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్‌లను ప్రతివాదులుగా చేర్చారు.

అంతకు ముందు.. శివలింగం వయసు తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షం వారణాసి కోర్టును కోరింది. కానీ, ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఆ తరుణంలోనే .. (ఏప్రిల్ 26న) మసీదు వెలుపలి గోడలపై ఉన్న హిందూ దేవతా విగ్రహాలను పూజించేందుకు అనుమతి కోరుతూ ఐదుగురు మహిళల బృందం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన దిగువ కోర్టు (సివిల్ జడ్జి-సీనియర్ డివిజన్) వీడియోగ్రాఫిక్ సర్వేను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో జ్ఞానవాపి కాంప్లెక్స్ లోపల "శివలింగం" కనిపించిందని హిందూ పక్షం పేర్కొంది. కానీ, ముస్లిం పక్షం మాత్రం ఆ వాదనలను తోసిపుచ్చింది. "వజూఖానా" రిజర్వాయర్ వద్ద ఉన్న ఫౌంటెన్ మెకానిజంలో ఈ నిర్మాణం ఒక భాగమని ముస్లిం పక్షం పేర్కొంది. ఈ ప్రాంతంలో నమాజ్ కు వచ్చిన వారు పుణ్యస్నానాలు చేస్తారని పేర్కొంది.

ఈ క్రమంలో ఈ కేసు మే 20న సివిల్‌ జడ్జి సీనియర్‌ డివిజన్‌ ​​నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అయితే.. సమస్యలోని సంక్లిష్టతలను, సున్నితత్వాన్ని పరిశీలిస్తే.. మరింత అనుభవం ఉన్న సీనియర్‌ జ్యుడీషియల్‌ అధికారి ఉంటే మంచిదని అభిప్రాయపడింది. ఇదిలాఉంటే... జ్ఞాన్‌వాపీ ప్రాంగణంలో మూసి ఉన్న భూగర్భ స్థలాలను సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ మరో పిటిషన్‌ దాఖాలైంది. ఇలాంటి ఉత్కంఠ పరిణామాల మధ్య వారణాసి కోర్టు ఏం తీర్పు చెబుతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. 
 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్