వైష్ణోదేవి భక్తులకు శుభవార్త: నిబంధనలతో దర్శనానికి అనుమతి... ఇవి తప్పనిసరి

By Siva KodatiFirst Published Aug 16, 2020, 5:00 PM IST
Highlights

 జమ్మూకాశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణో దేవీ ఆలయం దాదాపు 5 నెలల తర్వాత తిరిగి తెరుచుకుంది. ఆదివారం నుంచి భక్తుల దర్శనానికి అధికారులు అనుమతించారు

కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలతో పాటు ఆధ్యాత్మిక రంగం సైతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. గత ఐదు నెలల నుంచి దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తుల దర్శనాలు లేవు.

అయితే కొన్ని దేవాలయాల్లో నిదానంగా ఆంక్షలను సడలిస్తున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణో దేవీ ఆలయం దాదాపు 5 నెలల తర్వాత తిరిగి తెరుచుకుంది. ఆదివారం నుంచి భక్తుల దర్శనానికి అధికారులు అనుమతించారు.

కరోనా ప్రబలుతుండటంతో మార్చి 18న ఆలయాన్ని మూసివేశారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులను వైష్ణోదేవీ ఆలయానికి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మొదటి వారంలో 2000 మందిని దర్శనానికి అనుమతిస్తున్నట్లు వారు చెప్పారు. ఇందులో ఒక్క జమ్మూకాశ్మీర్ నుంచి 1,900 మంది, ఇతర ప్రాంతాల నుంచి కేవలం 100 మందికే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

దర్శనాల కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. భక్తులు వారి ఆరోగ్యంతో పాటు ఇతరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిబంధనలు పాటించాలని శ్రీమాతా వైష్ణోదేవీ ఆలయబోర్డు సీఈవో రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

రెడ్ జోన్ నుంచి వచ్చే వారు కోవిడ్ పరీక్షలు నిర్వహించుకుని, అనంతరం నెగిటివ్ పత్రాలను అందించాల్సిందిగా స్పష్టం చేశారు. యాత్రికులకు మాస్కులు తప్పనిసరని, అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందిగా సీఈవో కోరారు. 

click me!