
Gujarat: టాటా-ఎయిర్బస్ కన్సార్టియం తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ను సందర్శించనున్నారు. ఇది ప్రయివేటు రంగంలో దేశంలో మొట్టమొదటి విమాన తయారీ కేంద్రం. ఆత్మనిర్భరత, (స్వావలంబన) దిశగా ఒక కీలకమైన అడుగుగా దీనిని చూడవచ్చు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విమానాలను ఆధునీకరించడమే లక్ష్యంగా ఈ సీ-295 విమానం తయారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు ₹ 21,935 కోట్లు అని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
1. "అక్టోబర్ 30 ఒక ప్రత్యేకమైన రోజు.. ఎల్లప్పుడూ స్వావలంబను, ఆత్మనిర్భరతను సాధించాలనే మా అన్వేషణలో ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుంచుకోబడుతుంది. విమానయాన రంగానికి సంబంధించిన తదుపరి తరం మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఎదుగుతోంది. వడోదరలో జరిగే కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాను" అని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు ట్వీట్ చేశారు.
2. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, స్పెయిన్ ఆధారిత ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ మధ్య సహకారంతో దేశంలో సీ-295 మిలిటరీ ట్రాన్స్ ఫోర్టు విమానాల తయారీ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
3. గత సంవత్సరం, భారతదేశం 56 C-295 విమానాల కోసం ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో దాదాపు ₹ 21,000 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొదటి 16 విమానాలు స్పెయిన్ నుండి డెలివరీ చేయబడగా, వీటిలో 40 విమానాలు వడోదరలో తయారు చేయబడతాయి.
4. C-295 విమానాలు వైమానిక దళానికి చెందిన అవ్రో-748 విమానాలను భర్తీ (అప్ గ్రేడ్) చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ విమానాలు ఐరోపా వెలుపల తయారు చేయబడటం ఇదే మొదటిసారి.
5. ఆత్మనిర్భర్ భారత్ కింద ఏరోస్పేస్ పరిశ్రమలో సాంకేతిక, తయారీ పురోగతిని ప్రదర్శించే ప్రదర్శనను కూడా ప్రధాని నరేంద్ర మోడీ సందర్శిస్తారు.
6. కాగా, ఈ ప్లాంట్ ఇటీవల పెద్ద రాజకీయ దుమారమే రేపింది. ఎందుకంటే ఇదివరకు మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తామన్ని అన్ని పనులు పూర్తయిన తర్వాత చివర్లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్ కు తరలించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనీ, ఏక్ నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రాజెక్టును మహారాష్ట్ర నుంచి తరలిపోయిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
7. నాగ్‌పూర్‌లోని మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్, ఎయిర్‌పోర్ట్ (MIHAN)లో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి పాలక కూటమి గతంలో ప్రయత్నించింది.
8. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు బీజేపీపై దాడి చేస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ పదివేల ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.
9. సోమవారం నాడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ కెవాడియాలో ఉండనున్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో ఏర్పాటు చేయడంతో పాటు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రత్యేకంగా నిర్మించిన మియావాకీ అటవీ-మేజ్ గార్డెన్‌లను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు.
10. “ఈ వేడుకలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ పరేడ్ ఉంటుంది. ఐదు రాష్ట్ర పోలీసు బలగాలు, నార్తర్న్ జోన్ (హర్యానా), వెస్ట్రన్ జోన్ (మధ్యప్రదేశ్), సదరన్ జోన్ (తెలంగాణ), ఈస్టర్న్ జోన్ (ఒడిశా), ఈశాన్య జోన్ (త్రిపుర) నుంచి ఒక్కొక్కరు చొప్పున పాల్గొంటారు. ఈ బృందంతో పాటు కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆరుగురు పోలీస్ స్పోర్ట్స్ మెడల్ విజేతలు కూడా పరేడ్లో పాల్గొంటారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీ మంగళవారం రాజస్థాన్ లో పర్యటించనున్నారు.