అదర్ పూనావాలా అని నమ్మించి ‘సీరం’ నుంచి కోటి రూపాయాల మోసం.. ఎలాగంటే?

By Mahesh KFirst Published Nov 26, 2022, 2:59 PM IST
Highlights

కరోనా కష్టకాలంలో దేశానికి టీకా అందించి ఆదుకున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు కొందరు కుచ్చుటోపీ పెట్టారు. సీరం సీఈవో అదర్ పూనావాలా లాగే నమ్మించి దుండగులు రూ. 1.01 కోట్ల రూపాయాలను కొల్లగొట్టారు.
 

పూణె: కరోనా కష్టకాలంలో భారీగా టీకాలు తయారు చేసి దేశ ప్రజలకు అందించిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అందరి మదిలో నిలిచే ఉంటుంది. ఆక్స్‌ఫర్డ్, కేంద్ర ప్రభుత్వంతో డీల్ చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీరం సీఈవో అదర్ పూనావాలా కూడా మీడియాతో నేరుగా ఇంటరాక్ట్ కావడంతో చాలా మందికి తెలియవచ్చారు. అలాంటి సీరం సంస్థను అదర్ పూనావాలాగా పోజు ఇచ్చి కోటి రూపాయాలను కొందరు చీట్ చేశారు.

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ పోలీసు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీరం సీఈవో అదర్ పూనావాలాగా నటిస్తూ ఓ వ్యక్తి తనకు వాట్సాప్‌లో మెసేజీ పెట్టాడని డైరెక్టర్ సతీశ్ దేశ్‌పాండే కంప్లైంట్ చేశాడు. ఏడు ఖాతాల్లోకి డబ్బులు పంపాలని 2022 సెప్టెంబర్‌లో తనకు మెస్సేజీ పెట్టాడని వివరించాడు. ఆ మెస్సేజీ అదర్ పూనావాలాదే అనుకుని సతీశ్ దేశ్‌పాండే రూ 1.01 కోట్లను ఆ ఖాతాల్లోకి పంపించానని తెలిపాడు. ఆ తర్వాతే గుర్తు తెలియని వ్యక్తులు కంపెనీని చీట్ చేసినట్టు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read: దుబాయి మామకు కేరళ అల్లుడు టోకరా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 107 కోట్లు స్వాహా..

ఈ డబ్బును ఏడు బ్యాంకు ఖాతాల్లోకి పంపినట్టు తెలిసిందని, ఆ ఏడుగురు ఖాతాదారులను దేశంలోని పలు ప్రాంతాల  నుంచి అరెస్టు చేసినట్టు జోన్ 2 డీసీపీ స్మర్తానా పాటిల్ వివరించారు. అయితే, ప్రధాన నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడని చెప్పారు. 

ఈ ఏడు ఖాతాలతోపాటు వాటి నుంచి డబ్బులు బదిలీ అయిన మరో 40 అకౌంట్లను సీజ్ చేసినట్టు ఆమె తెలిపారు. అంతేకాదు, తాము రూ. 13 లక్షలను ఖాతాల్లోనే ఫ్రోజ్ చేసినట్టు వివరించారు.

పూణె సిటీ పోలీసు సైబర్ యూనిట్ శుక్రవారం ఈ కేసులోని ముగ్గురిని నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటి వరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్టు పోలీసు తెలిపారు.

click me!