ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ యువతిపై పలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా ఆమెకు మద్యం తాగించి ఈ ఘోరానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.
మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట వారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. పసి పాప నుంచి పండు ముసలిదాకా కామాంధులు ఎవరినీ వదలడం లేదు. తరచూగా చిన్నారులుపై, వృద్ధురాళ్లపై అత్యాచారాలు జరిగిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ దారుణాలకు పాల్పడే ముందు మహిళపై వికృత చేష్టలకు కూడా ఒడిగడుతున్నారు. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
ఓ మహిళపై పలువురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి మరీ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాకు చెందిన 25 ఏళ్ల ఓ యువతి హోటల్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెను పలువురు దుండగులు శనివారం ఓ సంపన్న హోమ్ స్టేకు తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయంలో తాజ్ గంజ్ పోలీసులకు శనివారం రాత్రి ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
నిందితులు తనకు సంబంధించిన ఓ అభ్యంతరకరమైన వీడియోను రూపొందించారని, దాని ద్వారా తనను బ్లాక్ మెయిల్ చేశారని తెలిపింది. బలవంతంగా తనకు మద్యం తాగించారని, తలపై గాజు సీసా పగులగొట్టారని బాధితురాలు పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు.. ఒక మహిళతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆగ్రా సదర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అర్చన సింగ్ ఆదివారం తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 307 (హత్యాయత్నం), 323 (ఉద్దేశపూర్వకంగా గాయపరచడం), అనైతిక ట్రాఫిక్ నిరోధక చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.