రిసెప్షనిస్టు హత్య కేసు.. నన్ను వ్యభిచారంలోకి దింపాలని చూస్తున్నారు.. మృతురాలి వాట్సాప్ చాట్‌లో కీలక విషయాలు

By Mahesh KFirst Published Sep 24, 2022, 7:25 PM IST
Highlights

ఉత్తరాఖండ్‌‌లో ఓ రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా పని చేసి హత్యకు గురైన మహిళ వాట్సాప్ మెస్సేజీల స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి. ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాలని రిసార్ట్ యాజమాన్య ఒత్తిడి చేసిందని మెస్సేజీలు వెల్లడిస్తున్నాయి. రూ. 10వేలకు ఎక్స్‌ట్రా సర్వీస్ చేయాలని బలవంతం చేస్తున్నట్టు బాధితురాలి మెస్సేజీలు బయటకు వచ్చాయి.
 

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని మహిళా రిసెప్షనిస్టు హత్య సంచలనంగా మారింది. ఉత్తరాఖండ్ అధికారిక పార్టీ బీజేపీ నేత, మాజీ మంత్రి వినోద్ ఆర్య కుమారుడు పులకిత్ ఆర్యకు చెందిన రిసార్ట్‌లో ఆ మహిళ రిసెప్షనిస్టుగా చేసింది. ఆమెను వ్యభిచారం రొంపిలోకి దింపాలని పులకిత్ ఆర్య ఒత్తిడి చేసినట్టు తెలుస్తున్నది. ఆ రిసార్ట్‌కు వచ్చిన గెస్టులకు ఎక్స్‌ట్రా సర్వీస్ (లైంగిక సంబంధ) కూడా చేయాలని బలవంతం చేసినట్టు సమాచారం. రిసెప్షనిస్టు మహిళ హత్యతో స్థానికులు తీవ్ర ఆందోళనలకు దిగారు. ఆ రిసార్ట్‌ను ధ్వంసం చేశారు.

ఆమెను వ్యభిచారంలోకి దింపాలనే ప్రయత్నాన్ని ప్రతిఘటించినందు వల్లే 19 ఏళ్ల ఆ యువతిని హత్య చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ ఆరోపణలను దాదాపు ధ్రువీకరించేలా ఆమె వాట్సాప్ చాట్‌ ఉన్నది. ఆమె వాట్సాప్ చాట్ సంచలన విషయాలను వెల్లడిస్తున్నది. 

ఓ ఫ్రెండ్‌కు పంపిన మెస్సేజీలో.. వారు తనను ప్రాస్టిట్యూషన్‌లోకి పంపాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఈ రిసార్ట్‌లో ఏదో తప్పు జరుగుతున్నదని మరెంతో కాలం అక్కడ పని చేయలేనని అన్నట్టుగా ఆ మెస్సేజీలు ఉన్నాయి. వీవీఐపీలకు రూ. 10 వేలకు ఎక్సట్రా సర్వీస్ చేయాలని ఒత్తిడి పెడుతున్నట్టు ఓ మెస్సేజీలో పేర్కొంది. ఓ వ్యక్తి తనను అసభ్యకరంగా తాకాడని, కానీ, మద్యం తాగి ఉన్నందున ఏమీ అవద్దని ప్రాధేయపడ్డట్టు వివరించింది. ఈ మెస్సేజీల స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. అలాగే, ఆ మహిళ ఓ రిసార్ట్ ఉద్యోగికి ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా స్ప్రెడ్ అవుతున్నది. పులకిత్ ఆర్య డిమాండ్ చేసినట్టు గెస్టులతో ఆ యువతి సెక్స్ చేయలేదు కాబట్టే హత్య చేశారని ఆమె ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఒకరు ఆరోపించారు. ఆమెకు ఫోన్ చేసిన రోజే 8.30 గంటల తర్వాత ఫోన్ మళ్లీ కనెక్ట్ కాలేదని ఆ ఫ్రెండ్ తెలిపారు. వెంటనే పులకిత్ ఆర్యకు ఫోన్ చేయగా.. ఆమె అప్పటికే రూమ్‌కు వెళ్లి పడుకున్నదని తెలిపారని వివరించారు. తర్వాతి రోజు పులకిత్‌కు మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చిందని, అప్పుడు రిసార్ట్ మేనేజర్ అంకిత్‌కు కాల్ చేశారని, ఆమె జిమ్‌లో ఉన్నదని ఆ రిసార్ట్ మేనేజర్ చెప్పాడని ఫేస్‌బుక్ ఫ్రెండ్ పేర్కొన్నారు. కాగా, చెఫ్ మాత్రం.. ఆమెను రోజు మొత్తం రిసార్ట్‌లో చూడనేలేదని చెప్పినట్టు తెలిపారు.

ఈ ఘటనపై బీజేపీ పై తీవ్ర వ్యతిరేకత రావడంతో పులకిత్ ఆర్య తండ్రి వినోద్ ఆర్యను, ఆయన సోదరుడ అంకిత్ ఆర్యను పార్టీ నుంచి తొలగించారు. ఉత్తరాఖండ్ మాతి కళా బోర్డు చైర్మన్ పదవి నుంచి, ఓబీసీ కమిషన్ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవుల నుంచి వారిని తొలగించారు.

పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఆమె మృతదేహం కెనాల్‌లో లభించిన సంగతి తెలిసిందే.

click me!