
Joshimath gets fresh snowfall & rain: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం జోషిమఠ్ లో శుక్రవారం ఉదయం భారీ హిమపాతం నమోదైంది. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో కొనసాగుతున్న భూ ఉపరితల ఆవర్తన సంక్షోభంతో ఈ ప్రాంత వాసులు పోరాడుతున్నారు. ఇప్పటికే పగుళ్లతో భూమిలోకి కుంగిపోతున్న జోషిమఠ్ లో భారీగా మంచు కురుస్తోంది. వర్షాలుపడే అవకాశముందనే భారత వాతావరణ శాఖ అంచనాలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. వీధుల్లో పార్క్ చేసిన కార్లు, ఇతర వాహనాలు, ఇండ్లు.. ఆ ప్రాంతంపై భారీగా మంచు కురుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జనవరి 24 వరకు జోషిమఠ్, చమోలీ జిల్లాలోని ఇతర ప్రాంతాలు, పితోర్ గఢ్ లో వర్షాలు కురవడంతో పాటు భారీ మంచు కురుస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే, దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్, దాని పరిసర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాదరసం పెరుగుదలకు కారణమైన వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ను తిరిగి యాక్టివేట్ చేయడం వల్ల ఉత్తరాఖండ్ లో వాతావరణ సరళిలో మార్పు వస్తుందని ఐఎండీ తెలిపింది. సోమ, మంగళవారాల్లో వర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం-డెహ్రాడూన్ డైరెక్టర్ తెలిపారు.
కాగా, జోషిమఠ్ ఇప్పటికే పగుళ్ల సంక్షోభం ఎదుర్కొంటోంది. ఇటీవలి భారత అంతరిక్ష సంస్థ రిపోర్టులు జోషిమఠ్ క్రమంగా భూమిలోకి కుంగిపోతున్నదని తన నివేదికల్లో పేర్కొనడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. పగుళ్లు ఎక్కువగా ఉండి, ప్రమాదపుటంచున ఉన్న ఇండ్లను, హోటళ్లను ప్రభుత్వం కూల్చివేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో ఇక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు ప్రారంభించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం జోషిమఠ్ సమీప పట్టణమైన పిపల్కోటిని సంక్షోభంలో చిక్కుకున్న 120 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి గుర్తించింది. జోషిమఠ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలో ఇది మొదటి దశ.
జోషిమఠ్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి చమోలి జిల్లా యంత్రాంగం గుర్తించిన నాలుగు స్థలాల్లో పిపల్కోటి కూడా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి రంజిత్ సిన్హా తెలిపారు. ఇతర ప్రదేశాలు ధక్, గౌంక్ సెలాంగ్ గ్రామాలు-ప్రభావిత ప్రాంతాలకు దూరంగా జోషిమఠ్ లోని ఉద్యాన భూమిగా ఉన్నాయి. ప్రస్తుతం బాధితులు హోటళ్లు, హోమ్ స్టేలు, సహాయ శిబిరాల్లో ఉంటున్నారు.
ఇదిలావుండగా, జోషిమఠ్ లోని భవనాల్లో పగుళ్ల వెడల్పులో గత మూడు రోజులుగా ఎలాంటి పెరుగుదల కనిపించలేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్ డీఎంఏ) గురువారం తెలిపింది. జోషిమఠ్ టో పగుళ్లు ఏర్పడిన మొత్తం భవనాల సంఖ్య ప్రస్తుతం 849గా ఉందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. జోషిమఠ్ ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందనీ, వారికి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.