నాలుగు నెలల్లో చార్‌ధామ్ యాత్ర.. జోషిమఠ్‌లో 70 శాతం ప్రజలు సాధారణ జీవితం గుడపుతున్నారు: ఉత్తరాఖండ్ సీఎం

By Sumanth KanukulaFirst Published Jan 19, 2023, 11:47 AM IST
Highlights

జోషిమఠ్‌లో ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయాలు అందజేస్తామని హామీ ఇచ్చిందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. జోషిమఠ్‌లో 65 నుంచి 70 శాతం మంది ప్రజలు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. 

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషీమఠ్‌ నగరంలో భూమి కుంగిపోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. భూమి కుంగిపోవడంతో వందల సంఖ్యలో ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జోషీమఠ్‌లో పరిస్థితి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. తాజాగా జోషిమఠ్‌లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బుధవారం పుష్కర్ సింగ్ ధామి సమావేశమై చర్చించారు. అనంతరం పుష్కర్ సింగ్ ధామి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు, నేను జోషిమఠ్‌లో పరిస్థితి, విపత్తు సహాయ శిబిరాల్లో ప్రజలు నివసిస్తున్న తీరు గురించి కేంద్ర హోం మంత్రికి వివరణాత్మక సమాచారం అందించాను. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కొత్త స్థలాల అన్వేషణ, ఇతర పనుల గురించి కూడా నేను సమాచారం ఇచ్చాను’’ అని చెప్పారు.

జోషిమఠ్‌లో ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయాలు అందజేస్తామని హామీ ఇచ్చిందని సీఎం చెప్పారు. జోషిమఠ్‌లో 65 నుంచి 70 శాతం మంది ప్రజలు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. అక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలకు పగుళ్లు వచ్చాయని చెప్పారు. ప్రత్యేక పర్యాటక ఆకర్షణ ప్రాంతంగా ఉన్న ఔలిలో అంతా సహజంగానే సాగుతోందని చెప్పారు. ఇప్పటికీ ఔలికి పర్యాటకులు పోటెత్తారని తెలిపారు.

పెద్దగా నష్టం జరగలేదని.. అయితే వివిధ మీడియా కథనాల ప్రకారం జోషిమఠ్ ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ముఖ్యమంత్రి ధామి అన్నారు. కేంద్ర హోం మంత్రితో జరిగిన సమావేశంలో జోషిమఠ్‌ బాధితుల సహాయ, పునరావాసంపై చర్చించినట్లు ధామి తెలిపారు. జోషిమఠ్‌ను సందర్శించే కేంద్ర బృందం తుది నివేదిక సమర్పించిన తర్వాత అలాంటివి వస్తాయని చెప్పారు.

జోషిమఠ్‌లో పరిస్థితిని చూసి భయపడాల్సిన అవసరం లేదని.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూర్చున్న వ్యక్తులు దీనిపై వ్యాఖ్యానించవద్దని సూచించారు. అంతేకాకుండా వచ్చే నాలుగు నెలల్లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. హిందువుల ప్రసిద్ధ తీర్థయాత్రలలో ఒకటైన చార్ ధామ్ యాత్ర.. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ నాలుగు పవిత్ర స్థలాల పర్యటనను కలిగి ఉంటుంది. జోషిమఠ్ మీదుగా  ఈ యాత్ర సాగనుంది. 

ఇక, జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంతో 800 ఇళ్లకు పైగా పగుళ్లు పడ్డాయి. నగరంలోని రోడ్లు, దేవాలయాలు, భూమిలో భారీగా పగుళ్లు కనిపించాయి. అయితే ఇప్పటి వరకు దాదాపు 250 కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించారు. అయితే ఈ పరిస్థితికి పాలకవర్గం చేసిన అభివృద్ది కార్యక్రమాలనే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

click me!