
Uttar Pradesh : ఒకప్పుడు ప్రపంచదేశాలు భారత్ ను గుర్తుపట్టేవి కావు… కానీ ఇప్పుడు అదే దేశం ఒక పెద్ద శక్తిగా తనను తాను నిరూపించుకుంటోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ మార్పు నాయకత్వ పనివిధానం వల్లే వచ్చిందన్నారు. దేశం పట్ల ప్రపంచం దృక్పథాన్ని మార్చగల సామర్థ్యం ఉన్నదే సమర్థవంతమైన, ప్రభావవంతమైన నాయకత్వం… గత 11 ఏళ్లుగా దేశంలో అలాంటి నాయకత్వాన్నే చూస్తున్నామంటూ మోదీ ప్రభుత్వాన్ని యోగి కొనియాడారు.
శాంసంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్ నిర్వహించిన సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం, ఇతర సాంకేతిక సంస్థలకు చెందిన సుమారు 1300 మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ… 2014కు ముందు భారతదేశం గుర్తింపు సంక్షోభంలో ఉండేదని అన్నారు. అవినీతి వ్యవస్థ ఆధిపత్యం చెలాయించేదని… ప్రపంచ స్థాయిలో దేశ గౌరవం తగ్గిపోతే ఉండేదన్నారు. యువత గుర్తింపు కోసం ఇబ్బంది పడేవారన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 11 ఏళ్లలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రపంచ స్థాయిలో భారతదేశానికి బలమైన గుర్తింపును పొందిందని యోగి పేర్కొన్నారు.
పీఎం స్టార్టప్, పీఎం స్టాండప్, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు భారతదేశానికి కొత్త గుర్తింపును ఇవ్వడమే కాకుండా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో కూడా ఎంతగానో దోహదపడ్డాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మార్పు అకస్మాత్తుగా రాలేదని, దీని కోసం ప్రభుత్వ స్థాయిలో అనేక ప్రయత్నాలు జరిగాయని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
సాధారణ ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి యువత అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం యోగి పిలుపునిచ్చారు. జీవన సౌలభ్యాన్ని పెంచడంలో సాంకేతికత చాలా సహాయకారిగా ఉంటుందన్నారు. జీవితాన్ని మరింత సులభంగా, సరళంగా మార్చడానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమని యోగి అన్నారు.
దేశాభివృద్ధికి, జీవన సౌలభ్యానికి సాంకేతికత ప్రాముఖ్యతను జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020లో కూడా గుర్తించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశంలో మరింత సానుకూల మార్పులు తీసుకురావడంలో ఎన్‌ఈపీ పెద్ద పాత్ర పోషిస్తుందని… అయితే అన్ని విద్యాసంస్థలు దీనిని సకాలంలో అమలు చేయాలని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌ఈపీ లక్ష్యాలకు అనుగుణంగా టాటా టెక్నాలజీస్‌తో కలిసి 150కి పైగా ఐటీఐల నుండి యువతను ఆధునిక వృత్తి శిక్షణతో అనుసంధానించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోందని ముఖ్యమంత్రి యోగి తెలిపారు.
సీఎం యోగి తన ప్రసంగంలో విద్యార్థుల ముందు ఒక సంరక్షకుడి, ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించారు. వ్యవస్థను లేదా సిస్టమ్‌ను నిందించడం మనలో చాలా మందికి అలవాటుగా మారిందన్నారు. అలాంటి వారికి ప్రతి పనిలోనూ ప్రభుత్వమే దోషిగా కనిపిస్తుందన్నారు. అలాంటి వారు ఏదైనా సమస్యపై తమ తప్పులను సరిదిద్దుకోకుండా, ఇతరుల తప్పులను వెతకడంలోనే నిమగ్నమై ఉంటారు… దీని ఫలితంగా సమస్య మరింత జటిలమవుతుందన్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంసంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను స్వావలంబన మార్గానికి ఒక వేదికగా సూచించారు. దీనితో అనుసంధానమై యువత తమ స్టార్టప్‌లను ప్రారంభించవచ్చని ఆయను సూచించారు. దీని కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తోందని భరోసా ఇచ్చారు. యువత స్వావలంబన కోసం యూపీ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు.
యువతను స్వావలంబనపరులుగా చేయడానికి పరిశ్రమలు, సంస్థలు కలిసి పనిచేయాలని… పరిశ్రమలలో యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. యువతకు సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక పరిజ్ఞానం కూడా అవసరమని సీఎం యోగి అన్నారు. జ్ఞానం ఆచరణాత్మక రూపమే జీవితానికి ఉపయోగపడుతుందన్నారు. యువత అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో తమను తాము అనుసంధానించుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ప్రపంచంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో భారతదేశం అత్యధిక యువత ఉన్న దేశమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతదేశంలో కూడా అతిపెద్ద యువశక్తి ఉత్తరప్రదేశ్‌లో ఉంది… ఇక్కడ 50 నుండి 60 శాతం వర్కింగ్ ఫోర్స్ యువతదేనని తెలిపారు. ఈ యువత ఆధునిక శిక్షణతో అనుసంధానమై తమను తాము స్వావలంబనపరులుగా మార్చుకోవచ్చు…. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో దోహదపడవచ్చని అన్నారు. యువతను సాంకేతికతతో అనుసంధానించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వామి వివేకానంద యువ సాధికారత పథకం కింద 2 కోట్ల మంది యువతకు టాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌లు అందించే కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ శాంసంగ్ యూపీని తన తయారీ బ్రాండ్ అంబాసిడర్‌గా యూపీని ఎంచుకుందని సీఎం యోగి అన్నారు. నోయిడాలో శాంసంగ్ తన అతిపెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఉపయోగించే దేశమని ఆయన అన్నారు. భారతదేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్‌లలో 55 శాతం వాటా ఒక్క యూపీదేనని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో తయారయ్యే 60 శాతం ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఉత్తరప్రదేశ్‌లోనే తయారవుతున్నాయి. ఇక్కడ యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్.