రూ. 20 కోసం రైల్వేపై 20 ఏళ్ల పోరాటం.. కేసు గెలిచిన లాయర్‌కు వడ్డీతో సహా డబ్బులు

By Mahesh KFirst Published Aug 13, 2022, 3:21 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ లాయర్‌కు ట్రైన్ టికెట్ పై.. రూ. 20 రూపాయలు అధికంగా తీసుకున్నాడు. తనకు రావాల్సిన రూ. 20 ఇవ్వాలని కౌంటర్‌లోని క్లర్క్‌కు చెప్పగా అతను నిరాకరించాడు. దీంతో ఆ లాయర్ కన్జ్యూమర్ ఫోరమ్ ఆశ్రయించాడు. 21 ఏళ్లపాటు పోరాడిన తర్వాత కేసు గెలిచాడు.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే లేదా.. బస్ లేదా ఇంకా ఏ ఇతర చోట్లలోనైనా చిల్లర లేదంటే వదులుకునే వారు ఎక్కువ ఉంటారు. కానీ, ఓ వ్యక్తి కచ్చితంగా తనకు కావాల్సిందేనని వాదించాడు. అటు వైపు నుంచి సదరు ఉద్యోగి కూడా చిల్లర ఇచ్చేయకుండా కనీసం సర్ది చెప్పకుండా తప్పు చేశాడు. దీంతో తనకు రావాల్సిన చిల్లర ఇవ్వలేదని ఆయన కోర్టుకు ఎక్కాడు. చివరకు గెలిచాడు.

న్యాయవాది తుంగనాథ్ చతుర్వేది మధురలోని గాలి పిర్పంచ్‌ నివాసి. ఆయన మొరదాబాద్ వెళ్లడానికి మధుర కంటోన్మెంట్‌కు చేరాడు. మొరదాబాద్‌కు చేరడానికి టికెట్ కోసం టికెట్ కౌంటర్ వెళ్లాడు. మొరదాబాద్ కు రెండు టికెట్లు ఇవ్వాలని క్లర్క్ కు చెప్పాడు. ఆయన రూ. 90 తీసుకుని రెండు టికెట్లు చేతిలో పెట్టాడు. నిజానికి ఒక టికెట్ ధర రూ. 35గా ఉన్నది. కానీ, తీసుకున్నది మాత్రం రూ. 45. రెండు టికెట్లకు రూ. 70 తీసుకోకుండా రూ. 90 తీసుకున్నాడు. తనకు రావాల్సిన రూ. 20ని వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా చతుర్వేది క్లర్క్‌ను కోరాడు. కానీ, క్లర్క్ ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ ఘటన 1999 డిసెంబర్ 25వ తేదీన జరిగింది.

భారత రైల్వే టికెట్ పై అధిక డబ్బులు తీసుకున్నదని తుంగనాథ్ చతుర్వేది కన్జ్యూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించాడు. కన్జ్యూమర్ ఫోరమ్‌లో కేసు పెట్టాడు. నార్త్ ఈస్ట్రన్ రైల్వే గోరఖ్‌పూర్ జనరల్ మేనేజర్, మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ బుకింగ్ క్లర్క్‌లను పార్టీలుగా చేర్చాడు. 

ఈ కేసు అంత సింపుల్‌గా తెగిపోలేదు. సుమారు 21 ఏళ్లపాటు విచారణ జరిగింది. చివరకు కన్జ్యూమర్ ఫోరమ్ ఆ న్యాయవాదికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భారత రైల్వే సదరు బాధితుడికి రూ. 20 రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఏడాదికి రూ. 12 చొప్పున వడ్డీ చెల్లించాలని తెలిపింది. దీంతోపాటు పరిహారంగా రూ. 15,000 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ డబ్బులు 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. 

తనకు న్యాయం దక్కడానికి సుదీర్ఘ సమయం పట్టిందని, కానీ, న్యాయమైతే దక్కిందని చతుర్వేది సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కేసులో 21 ఏళ్లపాటు పోరాడటాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు నిరసించారు. రూ. 20 పోతే పోనీ అంటూ ఒత్తిడి చేశారు. కానీ, చతుర్వేది వదిలిపెట్టలేదు. దీంతో ఇప్పుడు వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా ఇలా గొంతు ఎత్తడం మంచిదని ఓ స్థానికుడు చెప్పాడు.

click me!