Salman Rushdie: అందుకే సల్మాన్ రష్దీ పుస్తకాన్ని బ్యాన్ చేశాం.. రష్దీ అద్భుత రచయిత: కేంద్ర మాజీ మంత్రి నట్వర్

By Mahesh KFirst Published Aug 13, 2022, 2:23 PM IST
Highlights

సల్మాన్ రష్దీ రాసిన సాతానిక్ వెర్సెస్ పుస్తకాన్ని 1988లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిషేధించింది. ఆ నిర్ణయంలో పాలుపంచుకున్న కేంద్ర మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ నిషేధించే నిర్ణయం సరైనదేనని అన్నారు. కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యల మూలంగానే ఆ పుస్తకాన్ని బ్యాన్ చేసే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
 

న్యూఢిల్లీ: సల్మాన్ రష్దీ పుస్తకం సాతానిక్ వెర్సెస్ పుస్తకం తీవ్ర కలకలం రేపింది. దాన్ని దైవ దూషణగా చాలా మంది ముస్లింలు భావించారు. అందుకే ముందు జాగ్రత్తగా పలు దేశాలు ఈ పుస్తకాన్ని నిషేధించాయి. భారత దేశం కూడా ఈ పుస్తకాన్ని బ్యాన్ చేసింది. 1988లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ పుస్తకంపై బ్యాన్ తెచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ ప్రమేయం కూడా ఉన్నది. ఇప్పుడు సల్మాన్ రష్దీ పై దాడితో సాతానిక్ వెర్సెస్ పుసకంపై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి, రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పని చేసిన కే నట్వర్ సింగ్ తమ నిర్ణయం సరైనదేనని మరోసారి సమర్ధించారు.

1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సాతానిక్ వర్సెస్ పుస్తకాన్ని నిషేధించింది. ఆ సమయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. ఇది ముస్లింలను సంతుష్టి పరిచే నిర్ణయమేనని ఆరోపించాయి. కానీ, వాటిని కేంద్ర మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ తిప్పికొట్టారు. తాజాగా, ఈ పుస్తకం నిషేధంపై మళ్లీ మాట్లాడారు. ఆ పుస్తకాన్ని నిషేధించే నిర్ణయం తప్పు కానే కాదు అనేదే తన అభిప్రాయం అని వివరించారు. ఎందుకంటే ఈ పుస్తకం దేశంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తెచ్చే ముప్పు ఉన్నదని తెలిపారు. ముఖ్యంగా కశ్మీర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉండేదని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోనూ అసంతృప్తి రగిలిందని అన్నారు.

ఈ పుస్తకం విడుదలైన తర్వాత ఏం చేద్దాం అని రాజీవ్ గాంధీ తనను అడిగారని వివరించారు. తన జీవిత కాలం అంతా పుస్తకాలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చానని తెలిపారు. కానీ, శాంతి భద్రతల విషయానికి వస్తే అద్భుతమైన రచయిత సల్మాన్ రష్దీది అయినా నిషేధించకతప్పదు అని పేర్కొన్నారు.

సల్మాన్ రష్దీ రాసిన మిడ్ నైట్ చిల్డ్రన్ నవల 20వ శతాబ్దపు గొప్ప రచన అని ఆయన వివరించారు. కానీ, సాతానిక్ వెర్సెస్ పూర్తిగా లా అండ్ ఆర్డర్ సమస్యతో ముడిపడి ఉన్నదని తెలిపారు. కేవలం ఆ కారణంతోనే సాతానిక్ వెర్సెస్ పుస్తకాన్ని నిషేధించాల్సి వచ్చిందని వివరించారు. ఎందుకంటే.. మన దేశంలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లిం జనాభా ఉన్నదని, వారిలోనూ తీవ్రంగా సెంటిమెంట్లు రగులుతున్నా కాలం అది అని వివరించారు. కాబట్టి, ఈ సమయానికి సాతానిక్ వెర్సెస్ పుస్తకం స్వీకరించదగిన పుస్తకం కాదని తెలిపారు.

75 ఏళ్ల సల్మాన్ రష్దీ అద్భుతమైన రచయిత అని, 20వ శతాబ్దపు గొప్ప రచయిత అని కేంద్ర మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ కొనియాడారు. సాహిత్యానికి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. కాని , కొందరు రాస్కల్స్ ఆయనను దాదాపు చంపేసినంత పని చేశారని తెలిపారు. తనకు సల్మాన్ రష్దీతో ప్రత్యక్ష సన్నిహితం ఏమీ లేదని, కానీ, ఆయన రచనలకు తాను వీరాభిమానిని అని చెప్పారు. ఆయనది హై క్లాస్ లిటరేచర్ అని తెలిపారు.

click me!