
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదలౌతున్నాయి. ఉదయం నుంచే ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. కాగా..ఎన్నికల్లో... తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నసమాజ్‌వాదీ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు పదివేల మెజారిటీ కలిగి ఉన్నారు.
రెండు రౌండ్లకుగాను అఖిలేష్‌కు 12,011 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ బగేల్‌కు 2,638 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తర్వాత బీఎస్పీ అభ్యర్థి 281 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో అఖిలేష్‌కు 80.09 శాతం ఓట్లురాగా, సమీప బీజేపీ అభ్యర్థికి 17.59 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అఖిలేష్‌కు భారీ మెజారిటీ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. గతంలో కంటే ఈ సారి జరిగిన ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అధికార పార్టీ బీజేపీ.. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ప్రచారం సాగిస్తూ.. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశాయి. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు సైతం గత వైభవం కోసం గట్టిగానే పోరాటం సాగించాయి. ఆయా పార్టీలు భవితవ్యం మార్చి 10 తేలనుంది.
యూపీ ప్రస్తుత అసెంబ్లీ గడువు మార్చి 14తో ముగుస్తుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరిగాయి. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య గట్టి పోరు సాగిందని ప్రస్తుత రాజకీయ పరిణమాలు గమనిస్తే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు సైతం తమదైన తరహాలో ప్రచారం సాగిస్తూ.. ఎన్నికల బరిలో ముందుకుసాగాయి. మొదటి విడుతలో 58 స్థానాలకు పోలింగ్ జరగగా.. ఈ సారి 60.17 శాతం పోలింగ్ నమోదైంది. 2017 ఎన్నికలతో పోలిస్తే ( 63.5 శాతం) తక్కువగా ఉంది.
ఇక యూపీ రెండో విడత ఎన్నికల్లో తొమ్మిది జిల్లాల్లోని మొత్తం 55 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 50 శాతం కంటే అధిక ముస్లిం ఓటర్లు ఈ ప్రాంతంలో ఉండటంతో అన్ని పార్టీలు ఓటర్లకు గాలంవేసేలా ముందుకు సాగాయి. 61.20 శాతం ఓటింగ్ నమోదైంది. మూడో దశలో 16 జిల్లాల్లోని 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 623 మంది బరిలో నిలిచారు. కీలకమైన 16 జిల్లాల్లో ఐదు జిల్లాలు పశ్చిమ యూపీ, 6 అవధ్ ప్రాంతం, 5 బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దశలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ , కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘేల్, శివపాల్ యాదవ్ వంటి నేతలు పోటి పడ్డారు. అలాగే, పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాలకు నాల్గో దశలో పోలింగ్ జరిగింది.
ఇక ఫిబ్రవరి 27న ఐదవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాలకు జరిగింది. మొత్తం 692 మంది బరిలోకి దిగగా.. వారిలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య , రాంపూర్ ఖాస్ నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధన మిశ్రా , కుంట సీటు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా , యూపీ కేబినెట్ మంత్రులు పోటీలో ఉన్నవారిలో ప్రముఖులు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తల్లి, అప్నాదళ్ నేత కృష్ణా పటేల్ అప్నాదళ్ కే తరపున పోటీలో ఉన్నారు. 10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో 6వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక సోమవారం నాడు (మార్చి 7) ఏడోదశ (చివరిదశ) ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 9 జిల్లాల్లోని 54 స్థానాలకు పోలింగ్ జరిగింది. 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇక ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత (ఎస్పీ), మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కర్కల్ నియోజవర్గం నుంచి బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గమనిస్తే.. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 325 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ కేవలం 47 సీట్లు, కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్పీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్య ఉంటుందని ఇప్పటికే ముందుస్తు అంచనాలు సైతం పేర్కొన్నాయి.