One Nation One Election: జమిలి ఎన్నికలు నిర్వహించడానికి మేం సిద్ధం: ఎన్నికల సంఘం

Published : Mar 10, 2022, 10:35 AM ISTUpdated : Mar 10, 2022, 10:43 AM IST
One Nation One Election: జమిలి ఎన్నికలు నిర్వహించడానికి మేం సిద్ధం: ఎన్నికల సంఘం

సారాంశం

జమిలి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర స్పందించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మంచి ప్రతిపాదన అని, అయితే, అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై పార్లమెంటులో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తాము అన్ని ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: ఎన్నికల(Elections) గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు అందులో జమిలి ఎన్నికల(One Nation One Election) అంశం తప్పకుండా వస్తున్నది. ఇటీవలి కాలంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై చర్చ పెరుగుతున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్లు(CEC) దీనిపై మాట్లాడటంతో జమిలి ఎన్నికల అంశం ప్రాధాన్యతను నిలబెట్టుకుంటున్నది. తాజాగా, మరోమారు ప్రస్తుత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర(Sushil Chandra) మాట్లాడారు.

ఓ మీడియా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాట్లాడారు. దేశంలోని అన్ని ఎన్నికలు ఒకే సారి జరగాలని భావిస్తే.. అది మంచి సూచనే అని అభిప్రాయపడ్డారు. కానీ, ఈ నిర్ణయం తీసుకోవాలంటే.. అందుకు అనుగుణంగా రాజ్యాంగంలో సవరణ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ జమిలి ఎన్నికలపై పార్లమెంటులో నిర్ణయం జరగాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి.. మిగతా సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరోసారి నిర్వహించాలా?అనే దానిపై పార్లమెంటులోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం అన్ని ఎలక్షన్స్‌ను ఏకకాలంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నదని, అన్నింటికి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించే సమర్థతను  కలిగి ఉన్నదని వివరించారు.

ఇదే ఇంటర్వ్యూలో ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించీ మాట్లాడారు. ఆ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలు చేసినప్పుడు తాము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ర్యాలీలు, పాదయాత్రలను నిషేధించాల్సి వచ్చిందని వివరించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు థర్డ్ వేవ్ గురించి ఎవరికీ తెలియదని అన్నారు. కానీ, డిసెంబర్‌ చివర్లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపించడం మొదలైందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ ఇంకా చాలా వెనుకబడి ఉన్నదని, అందుకే భౌతిక ర్యాలీలు, రోడ్ షోలను నిషేధించామని చెప్పారు. కేవలం డిజిటల్ ర్యాలీలకే అనుమతి ఇచ్చామని, డోర్ టు డోర్‌ ప్రచారానికి అనుమతులు ఇచ్చినా ప్రచారకర్తల సంఖ్యపైనా నిబంధనలు విధించామని తెలిపారు. తమ నిర్ణయాన్ని గౌరవించి పాటించిన రాజకీయ పార్టీలు, వోటర్లు అందరికీ ధన్యవాదాలు అని సీఈసీ సుశీల్ చంద్ర పేర్కొన్నారు.

గతంలోనూ కేంద్ర ప్రభుత్వం ఈ జమిలి ఎన్నికలపై పార్లమెంటులోనే ప్రకటన చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరగడం వల్ల నిర్వహణ వ్యయం భారీగా ఉంటున్నదని, వాటిని కలిపి ఒకే సారి నిర్వహిస్తే ఈ వ్యయం తగ్గించవచ్చని పేర్కొంది. ఇప్పటికే పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఈ మేరకు సిఫారసులు చేసిందని గతేడాది కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో వెల్లడించారు. 

అంతకు ముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను కేవలం మాటలకు పరిమితం చేయలేమని, ఇది దేశానికి ఎంతో అవసరం అని అన్నారు. దీనిపై నీతి ఆయోగ్ నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్ కూడా అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషన్ సునీల్ అరోరా కూడా సానుకూలంగానే స్పందించారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu