
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక కుక్క మొరుగుడు రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. ఇదికాస్త ముదిరి మాటల వాగ్వాదం నుంచి కొట్టుకునే స్థాయికి చేరుకుకుని రక్తపాతాన్ని సృష్టించింది. ఇరువర్గాల ఘర్షణలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఘర్షణపై దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో కుక్క మొరిగే విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కుక్క మొరిగినందుకు ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక మహిళ మరణించగా ఐదుగురు గాయపడ్డారు. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసు గురించి అదనపు పోలీసు సూపరింటెండెంట్ దుర్గా ప్రసాద్ తివారీ బుధవారం మాట్లాడుతూ, ఘర్షణలో 50 ఏళ్ల లాల్ ముని మరణించినట్లు చెప్పారు.
బైరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో కుక్క మొరిగడంపై వాదనల నేపథ్యంలో రెండు గ్రూపులు పరస్పరం ఘర్షణకు దిగాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 50 ఏళ్ల లాల్ ముని, మరో ఐదుగురు గాయపడ్డారు. వెంటనే ఆ మహిళను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ముని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. “ఈ ఘటనపై మేము శివసాగర్ బింద్, అతని కుమారుడు అజిత్‌లను అరెస్టు చేసాము. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించాం’’ అని అధికారి తెలిపారు.
గతవారం మరో ఘటనలో ఒక మహిళ మృతి..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని సరస్సులో చంపిన తన కుక్క మృతదేహాన్ని పారవేసే ప్రయత్నంలో ఓ మహిళ నీటిలో మునిగి చనిపోయింది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, ఆ మహిళ తన పెంపుడు కుక్క తనను, చిన్న పిల్లవాడిని కరిచినందుకు కోపంతో దానిని చంపేసింది. ఆ తర్వాత దానిని దగ్గరలోని సరస్సు వద్ద పడేయడానికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ప్రాణాలు కోల్పోయింది.
అయితే, గంటల తరబడి భార్య కనిపించకుండా పోవడంతో మహిళ భర్త ఆందోళన చెందాడు. ఆ తర్వాత భార్య కోసం వెతకగా ఒక సరస్సు దగ్గర ఆమె చెప్పులు కనిపించాయి. స్థానికులతో కలిసి భార్య మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించాడు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.