గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ పేరుతో యూపీ వ్యాపారికి ఫోన్.. రూ.2 కోట్లు డిమాండ్ , రంగంలోకి పోలీసులు

Siva Kodati | Published : Oct 8, 2023 5:57 PM

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారికి గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది . గోల్డీ బ్రార్ .. ఎన్ఐఏతో పాటు దేశంలోని పలు రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. గతేడాది జరిగిన పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతను ప్రధాన సూత్రాధారి. 

Google News Follow Us

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారికి అంతర్జాతీయ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను తాను గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌‌గా తెలిపినట్లు బాధితుడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కెనడాకు పారిపోయిన గోల్డీ బ్రార్ .. ఎన్ఐఏతో పాటు దేశంలోని పలు రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. గతేడాది జరిగిన పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతను ప్రధాన సూత్రాధారి. 

సెప్టెంబర్ 10న సాయంత్రం 6 గంటలకు వాట్సాప్‌లో అంతర్జాతీయ నెంబర్ నుంచి ఫిర్యాదుదారుడికి మొదటి కాల్ వచ్చినట్లుగా జాతీయ మీడియా సంస్థ పీటీఐ నివేదించింది. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని గోల్డీ బ్రార్ అని చెప్పినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు తొలుత ఇది ఫేక్ కాల్ అని భావించినప్పటికీ.. రెండ్రోజుల తర్వాత సెప్టెంబర్ 12న అదే నెంబర్ నుంచి మళ్లీ కాల్ వచ్చిందని, ఆ కాల్ చేసిన వ్యక్తి తనను బెదిరించాడని అధికారి ఒకరు తెలిపారు.

ఈసారి తనకు రెండు కోట్లు ఇవ్వాలని.. వాయిస్ నోట్ కూడా పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ వచ్చినప్పుడు తాను భయం భయంగా బతుకుతున్నానని.. రోజువారీ విధులు కూడా నిర్వర్తించలేకపోతున్నానని ఫిర్యాదుదారు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై యూపీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్న బ్రార్.. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా వున్నందున భద్రతా సంస్థలతో సమాచారాన్ని పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జూలైలో ఇంటర్‌పోల్ అతనిపై రెడ్ కార్నర్ నోటీసు (ఆర్ఎన్‌సీ) కూడా జారీ చేసింది. పంజాబ్‌లోని ముక్త్‌సర్ సాహిబ్‌కు చెందిన బ్రార్.. 2017లో కెనడాకు మకాం మార్చాడు. ఆ తర్వాత అమెరికాకు పారిపోయాడు. ఈ ఏడాది జూన్‌లోనూ రాపర్ హనీ సింగ్ తనకు బ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేసింది.