UP Elections 2022: నామినేషన్ వేయడానికి స్పోర్ట్స్ మినిస్టర్ పరుగులు.. క్రీడా స్ఫూర్తి?.. వీడియో వైరల్

Published : Feb 05, 2022, 04:13 PM IST
UP Elections 2022: నామినేషన్ వేయడానికి స్పోర్ట్స్ మినిస్టర్ పరుగులు.. క్రీడా స్ఫూర్తి?..  వీడియో వైరల్

సారాంశం

ఉత్తరప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి ఉపేంద్ర తివారీ నామినేషన్ పేపర్లు పట్టుకుని నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి దగ్గరకు పరుగులు తీశారు. దీంతో ఆయన వెంట ఉన్న సిబ్బంది, పోలీసులు, కార్యకర్తలు మంత్రితోపాటే పరుగులు పెట్టారు. ఆయన శుక్రవారం సాయంత్రం బల్లియా జిల్లా కలెక్టరేట్‌కు ఆలస్యంగా చేరారు. మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ ప్రక్రియ ముగియనుండటంతో మంత్రి పరుగులు పెట్టారు. ఆ రోజు నామినేషన్‌కు మరో మూడు నిమిషాల గడువు ఉన్నదన్న సమయంలో మంత్రి నామినేషన్ హాల్‌కు చేరారు.  

లక్నో: ఎన్నికల సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కో రోజు ఒక్కో విచిత్రం ముందుకు వస్తున్నది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (UP Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచుతున్నాయి. కొన్ని ఆసక్తికరంగానూ ఉంటున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి ఉపేంద్ర తివారీ(Sports Minister Upendra Tiwari) నామినేషన్ పేపర్లు చేత పట్టుకుని పరుగులు పెట్టారు. నామినేషన్ వేయాలని ఆయన జిల్లా కలెక్టరేట్ గేటు నుంచి నామినేషన్ హాల్ వరకు రన్నింగ్(Running) చేశారు. మంత్రితోపాటు ఆయన సిబ్బంది కూడా పరుగులు పెట్టక తప్పలేదు. ఆయన స్పోర్ట్స్ మినిస్టర్ కదా.. తన క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలనేమీ పరుగు తీయలేదు. నామినేషన్‌కు సమయం అయిపోతుందని పేపర్లు చేతపట్టుకుని ఉరికాడు. స్పోర్ట్స్ మినిస్టర్ రన్నింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

బల్లియా జిల్లాలోని ఫేఫ్నా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి స్పోర్ట్స్ మినిస్టర్ ఉపేంద్ర తివారీకి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఆయన ఆ స్థానం నుంచి నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రచారం చేస్తూ.. చేస్తూ మధ్యలోనే నామినేషన్ వేయాలని అనుకున్నారు. ఆయన బల్లియా కలెక్టరేట్ చేరే వరకు మంత్రి మెడలో పూల దండలు ఫుల్ అయ్యాయి. కాషాయ కండువా, కాషాయ వస్త్రంతోనే తలకు చుట్టుకున్నారు.

నామినేషన్ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఆయన నామినేషన్ పేపర్లు పట్టుకుని బయల్దేరినా.. ప్రచార కార్యక్రమాలతో ఆలస్య అయింది. ఇక కలెక్టరేట్ గేటు వద్దకు రాగానే మరెంతో సమయం లేకపోయింది. అక్కడి నుంచి నడుచుకుంటూనే వెళ్లాల్సి ఉన్నది. గడువు పది నిమిషాల లోపే ఉన్నది. దీంతో ఆయన పేపర్లు పట్టుకుని పరుగులు తీయక తప్పలేదు. ఆయన సిబ్బంది, పోలీసులు, ఇతర కార్యకర్తలూ మంత్రి వెంట పరుగులు పెట్టారు. నామినేషన్ హాల్‌కు చేరే సరికి నామినేషన్ వేయడానికి మరో మూడు నిమిషాల వ్యవధి మాత్రమే మిగిలిందని ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవారు చెప్పారు.

నామినేషన్ ప్రక్రియ ఆ రోజు 3 గంటలకు ముగిసినా.. ఆ ప్రక్రియ తర్వాతి రోజూ మళ్లీ జరగనుంది. ఎందుకంటే.. అక్కడ నామినేషన్‌లు ఈ నెల 11వ తేదీ వరకు రిటర్నింగ్ అధికారులు తీసుకోనున్నారు. కానీ, మంత్రి మాత్రం శుక్రవారం రోజే నామినేషన్ వేయాలని భావించారు. అందుకే పరుగులు పెట్టారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కాగా, ఓట్ల కౌంటింగ్ మార్చి 10వ తేదీన జరగనుంది.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?