
Up election news 2022 : ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని వస్తున్న సమయంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (AIMIM Chief Asaduddin oyc) కారుపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక్క సారిగా రాష్ట్రంలో కలకలం రేగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరిని కల్పించింది.
ఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ శనివారం మాట్లాడారు. తన కారుపై జరిగిన కాల్పుల ఘటనపై సరైన విచారణ జరిపించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ (Up cm yogi adhityanath)ను ఆయన కోరారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ మీ ప్రభుత్వం క్రికెట్ మ్యాచ్‌పై ఎన్‌ఎస్ఏను ప్రయోగించింది, కాబట్టి ఈ విషయంలో కూడా న్యాయం చేయండి. దీంతో మీరు స్వతంత్రులని యూపీ ప్రజలకు తెలుస్తుంది’’ అని అన్నారు. ఈ రాడికలైజేషన్ ప్రబలితే అది తీవ్రవాదంగా, మతవాదంగా మారుతుందని ఓవైసీ హెచ్చరించారు.
ఓవైసీపై కాల్పులు జరపడంతో ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించినప్పటికీ.. దానిని ఆయన తిరస్కరించారు. ఇది జరిగిన ఒక రోజు తరువాత ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. “ నేను మరణానికి భయపడను. నాకు Z కేటగిరీ భద్రత వద్దు, నేను దానిని తిరస్కరించాను. నన్ను 'A' కేటగిరీ పౌరుడిని చేయండి. నేను మౌనంగా ఉండను. దయచేసి న్యాయం చేయండి... వారిపై (షూటర్లు) యూఏపీఏ మోపండి.. ద్వేషం, రాడికలైజేషన్‌ను అంతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి’’ అని ఒవైసీ లోక్‌సభలో అన్నారు. అయితే తన భద్రత కోసం మాత్రం గ్లాక్ ఆయుధాలను తీసుకెళ్లడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు హాజరై ఢిల్లీకి తిరిగి వస్తుండగా అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా ఓవైసీ, అతని పార్టీ సభ్యులు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే తాము ప్రేరేపితమయ్యామని నిందితులు చెప్పారు. ఆ తరువాతే దాడికి ప్లాన్ చేశామని అన్నారు. నిందితులపై ఐపీసీ (IPC) సెక్షన్ 307 (హత్యా ప్రయత్నం), క్రిమినల్ సవరణ చట్టంలోని సెక్షన్ 7 కింద పిలాఖువా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న, రెండో దశ ఫిబ్రవరి 14న, మూడో దశ ఫిబ్రవరి 20న, ఫిబ్రవరి 23న నాలుగో దశ, ఫిబ్రవరి 27న ఐదో దశ, మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశలో జరుగుతాయి. ఎన్నికలకు మరో ఐదు రోజులు సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారం వేగవంతం చేశాయి. శుక్రవారం నాడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి శాసన సభకు పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇదే తొలిసారి.