ఇండోనేషియాను ఉదాహరణ చూపిస్తూ భారతీయ మైనారిటీలు రాముడిని తమ పూర్వీకుడిగా అంగీకరిస్తారా అని సీఎం యోగి ప్రశ్నించారు.
లక్నో : ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం ఇండోనేషియా అధ్యక్షుడు తన భారతీయ వారసత్వాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆయన పేరు కూడా సంస్కృతం నుండి వచ్చింది. ఇండోనేషియాలో రాముడిని పూర్వీకుడిగా భావిస్తారు, గరుడ వారి జాతీయ విమానయాన సంస్థ, గణపతి వారి కరెన్సీపై ఉంది, రామలీల వారి జాతీయ పండుగ అని యోగి తెలిపారు.
అయితే ఈ నేల మీద జీవిస్తూ, దాని వనరులను ఉపయోగించుకుంటూ, దురదృష్టవశాత్తు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోయిన భారతదేశంలోని పెద్ద జనాభా (ముస్లింలు) వారి పూర్వీకులు రాముడని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. లక్నోలోని తాజ్ హోటల్‌లో జరిగిన ప్రైవేట్ ఛానల్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా ఘాటుగా కామెంట్స్ చేసారు.
దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న అనేక కీలకమైన అంశాలపై సీఎం యోగి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భారతీయ మైనారిటీలు, విద్యుత్ దొంగతనం, వక్ఫ్ చట్టం, రాజకీయాలు, కుంభ్ 2025 ఏర్పాట్లు వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. భారతీయ మైనారిటీలు తమ పూర్వీకులను గర్వించాలని సీఎం యోగి సూచించారు. ఇండోనేషియా ఉదాహరణ చూపిస్తూ, ఒక పెద్ద ఇస్లామిక్ దేశం రాముడిని తమ పూర్వీకుడిగా భావిస్తుందని, దానిని గర్వంగా చెప్పుకుంటుందని, భారతీయ మైనారిటీలు కూడా తమ పూర్వీకులు రాముడేనని అంగీకరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
వక్ఫ్ చట్టంలో మార్పులపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ... కాలానుగుణంగా వక్ఫ్ చట్టంలో మార్పులు చేస్తున్నామని ముఖ్యమంత్రి యోగి స్పష్టం చేశారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ సవరణపై పనిచేయడం సంతోషంగా ఉందని, వచ్చే సమావేశాల్లో దీన్ని అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా మార్పుల ఉద్దేశ్యం సమాజంలో పారదర్శకత, న్యాయాన్ని నిర్ధారించడమేనని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో సీఏఏ అమలు చేసినట్లే వక్ఫ్ బిల్లు సవరణను కూడా అమలు చేస్తామన్నారు. సీఏఏ ద్వారా మన పొరుగు దేశాల మైనారిటీలకు దేశంలో పౌరసత్వం లభిస్తోంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో సాధ్యమైంది. వక్ఫ్‌కు సొంత భూమి ఉండదని, అది రెవెన్యూ భూమి అని సీఎం యోగి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో వక్ఫ్ ఒక లక్ష 27 వేల ఆస్తులపై తమకు హక్కు ఉందని అంటోంది... దాన్ని మేము పరిశీలించగా అది కేవలం 7 వేలు మాత్రమేనని యోగి తెలిపారు. ప్రజా ఆస్తులు రెవెన్యూకు చెందినవని, అక్కడ పోలీస్ స్టేషన్లు లేదా ఇతర ప్రజా ఉపయోగం లేదా పరిపాలనా భవనాలు నిర్మించడంపై ఎవరికీ అభ్యంతరం ఉండకూడదని అన్నారు.
సంభల్‌లోని షాహీ జామా మసీదుపై చెలరేగిన వివాదంపై స్పందిస్తూ... పురాణాల్లో సంభల్ ప్రస్తావన ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఐన్-ఇ-అక్బరీ ప్రకారం మీర్ బాకీ శ్రీహరి ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదును నిర్మించాడు. మేము ప్రతిచోటా ఆలయాల కోసం వెతుక్కోవడం లేదని, కానీ చారిత్రక ఆధారాలు ఉన్న చోట నిజం బయటపెట్టడం ముఖ్యమని ఆయన అన్నారు.
ఓవైసీ వ్యాఖ్యలపై స్పందిస్తూ... భారతీయ పురాణ గ్రంథాలు శ్రీహరి విష్ణువు యొక్క 10వ అవతారం ఎక్కడ జన్మిస్తుందో చెబుతున్నాయని ముఖ్యమంత్రి యోగి అన్నారు. 3500 నుండి 5000 సంవత్సరాల క్రితం ఈ గ్రంథాలు రచించబడ్డాయి. ఇస్లాంకు 1400 సంవత్సరాల చరిత్ర ఉంది, దానిపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
ఓవైసీ లేదా ఇతరులకు పురాణాలపై నమ్మకం ఉండకపోవచ్చు, కానీ కనీసం ఐన్-ఇ-అక్బరీని చూడాలని ఆయన అన్నారు. అది ఈ విషయాన్ని ప్రస్తావిస్తోంది, అక్కడ జరుగుతున్న తవ్వకాల్లో బయటపడుతున్న ఆధారాలు అక్కడ ఒక పురాతన నగరం ఉందని నిరూపిస్తున్నాయి. పురావస్తు అవశేషాల ఆధారంగా, పురాణాల్లో ప్రస్తావించబడిన సంభల్ నగరం ఇదేనని మనం చెప్పగలం. ప్రజలకు అక్కడ నమ్మకం ఉంది. ఈ విషయాలన్నీ బయటపడుతున్నప్పుడు, వారు ఈ నిజాన్ని అంగీకరించే ధైర్యం కూడా చూపించాలని తాను భావిస్తున్నానని యోగి అన్నారు..
సంభల్‌లో విద్యుత్ దొంగతనం సమస్యపై కఠిన చర్యలు తీసుకున్నామని సీఎం యోగి తెలిపారు. మూడు లక్షల జనాభా ఉన్న పట్టణంలో ప్రతి నెల 200 కోట్ల రూపాయల విద్యుత్ దొంగతనం జరిగేది.... మసీదులపై తాత్కాలిక సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసి విద్యుత్ దొంగతనం చేసేవారు. మేము నాలుగు మసీదులపై దాడి చేసి కనెక్షన్లు తొలగించామని యోగి తెలిపారు.
ఉత్తరప్రదేశ్ విద్యుత్ సంస్థకు సంవత్సరానికి 46,000 కోట్ల రూపాయల నష్టం వస్తోందని, వచ్చే ఏడాది నాటికి ఈ నష్టం 60,000 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఆయన అన్నారు. లైన్ నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సంభల్ పట్టణంలోనే 90 శాతం విద్యుత్ దొంగతనం జరిగేది, ఈ వ్యవస్థను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.