సైకిల్‌పై కుటుంబంతో సొంతూరికి ప్రయాణం: దారిలోనే కబళించిన మృత్యువు

By Siva KodatiFirst Published May 8, 2020, 4:53 PM IST
Highlights

కరోనా దెబ్బకు వలస కూలీలు విలవిలలాడుతున్నారు. ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకుని, అయినవారిని, సొంతవూరిని వదలిపెట్టి వందల కిలోమీటర్ల వలస వచ్చిన వారిని కోవిడ్ 19 చావు దెబ్బ కొట్టింది

కరోనా దెబ్బకు వలస కూలీలు విలవిలలాడుతున్నారు. ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకుని, అయినవారిని, సొంతవూరిని వదలిపెట్టి వందల కిలోమీటర్ల వలస వచ్చిన వారిని కోవిడ్ 19 చావు దెబ్బ కొట్టింది.

వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్థలు కుదేలవ్వడంతో కూలీలు పనులు కోల్పోయి పస్తుండాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఉపాధి లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడంతో తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని అనుకుంటున్నారు.

అయితే రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కొందరు కాలినడకన, మరికొందరు సైకిళ్లపై బయల్దేరుతున్నారు. దారి మధ్యలో దాతలు ఇచ్చే ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు. లేని పక్షంలో మంచినీళ్లు తాగి సరిపెట్టుకుంటున్నారు.

Also Read:జైల్లో 103 మందికి కరోనా వైరస్... బెయిల్ కోసం బంధువుల పరుగులు

కానీ మార్గమధ్యంలోనే కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా సైకిల్‌పై తమ సొంతూరికి బయల్దేరిన ఓ వలస కార్మికుడి కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబళించింది.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కృష్ణ, అతని భార్య ప్రమీల ఉపాధి నిమిత్తం లక్నోకు వలస వచ్చి అక్కడి జాన్కీపుర మురికివాడలోని ఇరుకు ఇంటిలో నివసిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తెతో చాందినీతో పాటు మూడేళ్ల కొడుకు నిఖిల్ ఉన్నాడు.

గత నెలన్నర రోజులుగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఈ దంపతులకు పని లేక, తిండికి తిప్పలు పడుతున్నారు. దీంతో చేసేది లేక ఎలాగైనా స్వస్థలానికి వెళ్లిపోదామని నిర్ణయించుకుని భార్యా, పిల్లలను ఒకే సైకిల్‌పై ఎక్కించుకుని స్వస్థలానికి బయల్దేరాడు.

Also Read:దేశంలో 56వేలు దాటిన కరోనా కేసులు, 24గంటల్లో 5వేల కేసులు

అలా కొంతదూరం వెళ్లిన అనంతరం షహీద్ పాత్ వద్ద ఓ గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి కృష్ణ నడుపుతున్న సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించగా, తీవ్రగాయాల పాలైన ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం చిన్నారులిద్దరూ చావు బతుకుల మధ్య మృత్యువుతో పోరాడుతున్నారు. కృష్ణ, ప్రమీల మరణవార్తతో వీరి కుటుంబసభ్యులు హుటాహుటిన లక్నో చేరుకుని అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!