
UP Election2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ పోలింగ్ భాగంగా.. 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.27 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. ఓటర్లు తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు క్యూకట్టారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. కఠిన చలిలోనూ ఓటు వేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు.
శామ్లి, హాపూర్, గౌతంబుద్ధనగర్, ముజఫర్‌నగర్, మీరట్, బాఘ్‌పట్, ఘజియాబాద్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఇందులో కైరానా, ముజఫర్‌నగర్, థానా భవన్, సార్థానా, అత్రౌలి, నోయిడా, బాఘ్‌పట్, మధుర వంటి కీలక ప్రాంతాల్లో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఈ స్థానాల్లో జాట్ వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ.. ఫలితాల మీద వీరు ప్రభావం చూపించనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఈ సామాజిక వర్గమే.
పోలింగ్ ప్రారంభానికి ముందు.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సోషల్ మీడియా వేదిక గా మాట్లాడుతూ.. పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తప్పు చేస్తే.. ఉత్తరప్రదేశ్ ఓ కాశ్మీర్ లాగా.. కేరళ లాగా లేదా బెంగాల్‌గా మారుతుందని హెచ్చరించారు. బిజెపికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. బిజెపికి ఓటు వేస్తే భయరహిత జీవితానికి హామీ అని అన్నారు.
" ఈ ఐదేళ్లలో యూపీలో చాలా అద్భుతాలు జరిగాయి. మీ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా.. బీజేపీ కి ఓటు వేయండి. మీ ఒక్క ఓటు నేర రహిత, భయం లేని, అల్లర్లు లేని ఉత్తరప్రదేశ్ సంకల్పాన్ని బలపరుస్తుంది. బీజేపీ ఓడిపోతే.. ఉత్తరప్రదేశ్ కూడా కాశ్మీర్, కేరళ, బెంగాల్‌గా మారుతుందని అని యోగి ఆదిత్యనాథ్ వీడియోలో పేర్కొన్నారు. ‘ఐదేళ్ల నా శ్రమకు మీ ఓటు దీవెన.. మీ ఓటు.. మీ నిర్భయ జీవితానికి గ్యారెంటీ’ అని పేర్కొన్నారు.
"ప్రజాస్వామ్యం గొప్ప త్యాగం మొదటి దశ ఇది. గత ఐదేళ్లలో, బిజెపి యొక్క డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంకితభావం,నిబద్ధతతో పని చేసింది. మీరు ప్రతిదీ చూశారు..ప్రతిదీ వివరంగా విన్నారు. మీ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా ఈ కర్మ పూర్తి కాదు. అందుకే ‘మొదట ఓటేయండి, తర్వాత రిఫ్రెష్‌మెంట్’ తర్వాత ఏదైనా పని…’ అంటూ పేర్కొన్నారు.
యూపీలో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థిగా నిలిచారు. పోలింగ్ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ.. తన ట్విట్టర్ ద్వారా.. ఓటర్లంతా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నాలని కోరారు. మార్చి 10న యూపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎవ్వరూ విజేతనో .. ఎవరికి అధికారం వరిస్తుందో వేచి చూడాలి.