యుపి ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 : వ్యాపారంలోనే కాదు సందర్శకుల్లోనూ రికార్డే

By Arun Kumar PFirst Published Sep 30, 2024, 11:05 AM IST
Highlights

గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరిగిన యుపి అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన 2024 అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారి సంఖ్య, వ్యాపార లావాదేవీలు కొత్త రికార్డులు సృష్టించాయి.  

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరిగిన యుపి అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన 2024 అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారి సంఖ్య, వ్యాపార లావాదేవీలు కొత్త రికార్డులు సృష్టించాయి. ఆదివారం ముగిసిన ఈ ఐదు రోజుల కార్యక్రమంలో 5.5 లక్షల మంది హాజరయ్యారు. గత ఏడాది 3 లక్షల మందితో పోలిస్తే ఈ ఏడాది ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉత్తరప్రదేశ్ లో వ్యాపారాలు చేసేందుకు పెట్టుబడిదారలు ముందుకు వస్తున్నారని... ప్రజలు కూడా యూపీ ఉత్పత్తులపై ఆసక్తి చూపిస్తున్నారని అనడానికి ఈ  యుపి ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 నిదర్శనంగా నిలిచింది.

2.60 లక్షలకు పైగా సందర్శకులు బి2బి (బిజినెస్ టు బిజినెస్), బి2సి (బిజినెస్ టు కస్టమర్) లావాదేవీలలో పాల్గొన్నారు. దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు గణనీయమైన అమ్మకాలు, ఆర్డర్‌లను ఇచ్చారు. ఇది ప్రభుత్వం, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచింది. ఈ వాణిజ్య ప్రదర్శన, వ్యవస్థాపకులు తమ పరిధులను విస్తరించుకుంటూ ముందుకు సాగడానికి ఒక వేదికను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారాలకు ఒక ముఖ్యమైన ఘట్టంగా తన పాత్రను పటిష్టం చేసుకుంది.

Latest Videos

ఈ ప్రదర్శన విజయంతో ఉత్సాహంగా ఉన్న యోగి ప్రభుత్వం ఇప్పుడు డివిజనల్, జిల్లా స్థాయిలలో ఇలాంటి వాణిజ్య ప్రదర్శనలను నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అంతేకాకుండా యుపి అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన యొక్క మూడవ ఎడిషన్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 నుండి 29 వరకు జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని వ్యాపారాలకు మరింత పెద్ద వేదికను అందించడానికి ఇది సిద్ధంగా ఉంది.

ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ముగింపు సందర్భంగా ఎమ్ఎస్ఎంఈ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి రాకేష్ సచన్ వివిధ విభాగాలకు చెందిన వ్యాపారులు, కంపనీల ప్రతినిధులను సత్కరించారు. సీఎం యోగి మార్గనిర్దేశంలో వాణిజ్య ప్రదర్శన విజయవంతమైందని అన్నారు. భవిష్యత్తులో డివిజనల్, జిల్లా స్థాయిలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి మార్గం సుగమం చేసిందని సచన్ అభిప్రాయపడ్డారు. చిన్న వ్యాపారాలకు పెద్ద మార్కెట్‌లను అందుబాటులోకి తీసుకురావడం, వాటి వృద్ధి అవకాశాలను పెంచడమే ఈ ట్రేడ్ షో ల ఏర్పాటు లక్ష్యం అని అన్నారు. .

సీఎం యోగి నాయకత్వంలో జరిగిన ఈ రెండవ ఎడిషన్ వాణిజ్య ప్రదర్శన కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని... రాష్ట్రవ్యాప్తంగా వ్యవస్థాపకులకు ఉత్సాహాన్ని నింపిందని ఆయన అన్నారు. సందర్శకుల భారీగా తరలిరావడం ఈ కార్యక్రమానికి పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తుంది. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందనిమంత్రి సచన్ పేర్కొన్నారు.

ముగింపు రోజు సాంస్కృతిక కార్యక్రమాలు  

వాణిజ్య ప్రదర్శన చివరి రోజు ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రీతి తివారీ ద్వారా కథక్ నృత్య నాటకం, జితేంద్ర చౌరాసియా,  అతని బృందం ద్వారా బుందేల్‌ఖండీ జానపద పాటలు, దేవేంద్ర శర్మ మంగళముఖి ద్వారా కథక్ ప్రదర్శన జరిగాయి. హనుమాన్ చాలీసాపై నృత్య నాటకం, బ్యాండ్ స్తుతి ప్రదర్శనలతో పాటు మరికొన్ని  అద్భుత ప్రదర్శనలు జరిగాయి. పలాష్ సేన్, యూఫోరియా బ్యాండ్ యొక్క అద్భుతమైన ప్రదర్శనతో ఈ కార్యక్రమం ముగిసింది.

UPITS 2024లో ఉత్తమ స్టాల్‌లకు అవార్డులు

యుపి అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన 2024 చివరి రోజు ప్రతి హాలు నుండి ఉత్తమ స్టాల్‌లను అవార్డులతో సత్కరించారు. ఇది రాష్ట్రం యొక్క గొప్ప వ్యాపార సామర్థ్యాన్ని హైలైట్ చేసింది. విజేతలలో అమెజాన్ క్రాఫ్ట్ (సంభాల్), మొఘల్ ఓవర్సీస్ (మురాదాబాద్), ఆరోగ్య (గౌతమ్ బుద్ధ నగర్) ఇతరులు ఉన్నారు. ఈ అవార్డులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారాల యొక్క అద్భుతమైన ప్రదర్శనలు, సహకారాలనికి గుర్తింపుగా నిలిచాయి. 

స్టాల్‌లతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులు వివిధ పోటీలలో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ప్రాజెక్ట్ పోటీలో పాల్గొన్న యువత నూతన ఆలోచనలను వెలుగులోకి తెచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఇండియా ఎక్స్‌పో సెంటర్ చైర్మన్ రాకేష్ కుమార్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

యుపి యొక్క వైవిధ్యభరితమైన రుచులు, హస్తకళలు 

ఐదు రోజుల ఈవెంట్‌లో సందర్శకులు ఉత్తరప్రదేశ్ యొక్క గొప్పతనం, వైవిధ్యాన్ని ఆస్వాదించారు. దీనిలో రాష్ట్రంలోని గొప్ప వంటకాలు కూడా ఉన్నాయి. యూపీలోని   వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు ప్రత్యేక వంటకాలను ఆస్వాదించారు. ఇది ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆహారంతో పాటు ప్రదర్శనలో విస్తృత శ్రేణి ఉత్పత్తులను ప్రదర్శించారు. సందర్శకులు వీటిని తిలకించేందుకు ప్రత్యేక ఆసక్తి కనబర్చారు. హస్తకళలు, సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు, వస్త్రాలు, ఆహార శుద్ధి వస్తువులు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులపై సందర్శకులు ప్రత్యేక ఆసక్తిని కనబర్చారు. కుండలు తయారీ, నేత,  ఎంబ్రాయిడరీ వంటి సాంప్రదాయ హస్తకళలు కూడా సందర్శకులను ఆకర్షించాయి. ముఖ్యంగా ఆహారం,  పానియాల పెవిలియన్ ను ఎక్కువమంది సందర్శించారు. 

దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు

ఈ వాణిజ్య ప్రదర్శన వ్యాపారులకు ఒక ముఖ్యమైన వేదికగా మారింది. దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు ఈ షో లో పాల్గొన్నారు. వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ (ODOP), ఎమ్ఎస్ఎమ్ఈ వంటి వాటినుండి ప్రదర్శనకు వచ్చిన ఉత్పత్తులు విదేశీ కొనుగోలుదారులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయి. ఆస్ట్రేలియా, జింబాబ్వే, క్యూబాతో పాటు ఈ ఏడాది భాగస్వామ్య దేశమైన వియత్నాం వంటి దేశాలు తమకున్న ఆసక్తిని వ్యక్తం చేశాయి. చాలా మంది ప్రదర్శకులు గణనీయమైన ఒప్పందాలను కుదుర్చుకున్నారు.

 ఈ ట్రేడ్ షోలో కొత్తగా పాల్గొనేవారిలో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. ప్రపంచ మార్కెట్‌లతో కనెక్ట్ అయ్యే ఈ అవకాశాన్ని వారు పూర్తిగా ఉపయోగించుకున్నారు.

యుపి అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన 2024: ముఖ్యాంశాలు

- యుపి అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన 2024ను సెప్టెంబర్ 25న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రి జితన్ రామ్ మాంఝీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, పీయూష్ గోయల్ కూడా ఈ ప్రదర్శనను సందర్శించారు. మూడో రోజు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, నాలుగో రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇక్కడకు విచ్చేశారు.

- ఈ ప్రదర్శన 15 హాళ్లలో నిర్వహించబడింది. ప్రముఖ కంపనీలు అదానీ, రిలయన్స్, లూలూ హైపర్ మార్కెట్, వైబ్స్ వంటివి కూడా ఈ ట్రేడ్ షో లో భాగమయ్యాయి. యుపి ఎలక్ట్రానిక్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాల్‌లో 100 కంటే ఎక్కువ స్టార్టప్‌లు, టెక్ కంపనీలు పాల్గొన్నాయి.

- మహిళలు, దివ్యాంగులైన వ్యవస్థాపకులతో సహా వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ (ODOP) నుండి 325 మంది ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. పశుసంవర్ధక, పాడి, మత్స్య, వ్యవసాయం, ఆహార శుద్ధి వంటి రంగాల నుండి కంపెనీలు కూడా పాల్గొన్నాయి. ఆహార శుద్ధి హాల్‌లో నమూనాలను అందించాయి.

- హాల్ నంబర్ 14, 15 ఎగుమతుల కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. అక్కడ ఉత్తరప్రదేశ్ యొక్క అన్ని ఎగుమతి చేయదగిన ఉత్పత్తులు ఉన్నాయి. ఈ హాళ్లలో ఎక్కువ మంది విదేశీ కస్టమర్లు కనిపించారు.

- 400 కంటే ఎక్కువ మంది అంతర్జాతీయ కొనుగోలుదారులను ఆహ్వానించారు. వారికి ఇక్కడ బి2బి సమావేశాల అవకాశం కల్పించారు. దీని ద్వారా ఎగుమతిదారులకు కోట్ల రూపాయల ఆర్డర్లు వచ్చాయి.

- విద్యుత్, పునరుత్పాదక ఇంధన, రక్షణ కారిడార్ యొక్క ఉత్పత్తులు ప్రదర్శించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. దీనితో పాటు, అనేక పెద్ద విశ్వవిద్యాలయాలతో సహా విద్యకు సంబంధించిన అనేక సంస్థలు యువతకు తమ సౌకర్యాల గురించి వివరాలను అందించాయి.

- ఇ-కామర్స్, స్టార్టప్‌లు, ఎగుమతి సామర్థ్యం, బీమా,ఆర్థిక నిబంధనలు వంటి అంశాలపై ఐదు నాలెడ్జ్ సెషన్‌లు నిర్వహించబడ్డాయి.

- ప్రతి సాయంత్రం అంకిత్ తివారీ, కనికా కపూర్, పలాష్ సేన్ యొక్క యూఫోరియా బ్యాండ్ వంటి ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

- లక్నోలోని తుండే కబాబ్, బల్లియా నుండి చోఖా, కాన్పూర్ నుండి చాట్, ఖుర్జా నుండి ఖుర్చన్, ఆగ్రా నుండి పంచీ పేఠా, మథుర నుండి పేడ, బనారస్ నుండి పాన్ వంటి సాంప్రదాయ యుపి వంటకాలను సందర్శకులు ఆస్వాదించారు.

- ఈవెంట్ యొక్క నాల్గవ రోజు వ్యవస్థాపకులు అమెరికాా, ఫ్రాన్స్,జపాన్‌లోని కంపెనీల నుండి రూ. 100 కోట్లకు పైగా ఆర్డర్‌లను పొందారు. బిర్లా ఎయిర్‌కాన్, సోనీ నుండి రూ. 50 కోట్లు, మద్రాసన్ నుండి రూ. 25 కోట్లు, వాడిలాల్ ఐస్ క్రీం, జైన్ శిఖంజీ నుండి రూ. 10 కోట్ల విలువైన ఆర్డర్‌లు ప్రధాన ఒప్పందాలలో ఉన్నాయి.

- ఈ కార్యక్రమానికి 5 లక్షలకు పైగా సందర్శకులు హాజరయ్యారు. మొదటి నాలుగు రోజుల్లో 2.6 లక్షలకు పైగా బి2బి, బి2సి సెషన్‌లలో పాల్గొన్నారు.

- YEIDA, UPSIDA, సమాచార ప్రజా సంబంధాల విభాగం, గ్రామీణాభివృద్ధి, ఉత్తరప్రదేశ్ నైపుణ్యా అభివృద్ధి మిషన్, IT ఆండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం వంటి వివిధ ఇతర స్టాల్‌లు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

- UPITS 2024 ప్రారంభించిన తర్వాత భాగస్వామ్య దేశమైన వియత్నాం రాయబారి ప్రతినిధుల బృందంతో కలిసి సీఎం యోగితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఆహార శుద్ధి మరియు IT రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారు.

click me!