
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఫస్ట్, సెకండ్ వేవ్‌ల సమయంలో రోజులు అత్యంత దయనీయంగా గడిచాయి. ముఖ్యంగా తొలి వేవ్‌లో వలస కార్మికుల సమస్యలు చెప్పనలవి కానివి. చాలీ చాలని జీతాల కోసం కుటుంబాన్ని మొత్తం వదిలి రాష్ట్ర సరిహద్దులు దాటి ఎక్కడెక్కడో పని చేసుకుంటూ పొట్టపోసుకునే వలస కార్మికులు.. ఈ మహమ్మారి దెబ్బతో విలవిల్లాడిపోయారు. లాక్‌డౌన్‌లు విధించినా.. వందల కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి రోడ్లపై నడుచుకుంటూ వెళ్లిన రక్తపు అడుగులను అంత సులువుగా మరిచిపోలేం.
మార్గం మధ్యలోనే అసువులు బాసినవారు ఎందరో. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి స్వగ్రామాలకు వెళ్లిన వలస కార్మికులు తమ సైకిళ్లను అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. ట్రైన్లు, బస్సులు అరేంజ్ చేయడంతో వారు తమ సైకిళ్లను అక్కడే ఉంచి ఆ వాహనాల్లో వెల్లిపోయారు.
అయితే, ఆ సైకిళ్లను తర్వాత మళ్లీ వెనక్కి తీసుకోవడానికి వారికి టోకెన్లు కూడా ఇచ్చారు. కొందరు మళ్లీ వెనక్కి వెళ్లి ఆ సైకిళ్లను తీసుకున్నారు. కానీ, చాలా మంది ఆ సైకిళ్లను తెచ్చుకోలేదు. అప్పటి పీడకలను మళ్లీ కదపకుండా.. చెరపకుండా ఉండటానికి ఆ సైకిళ్లను వదిలిపెట్టుకున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వలస కార్మికులు వదిలిపెట్టి వెళ్లిపోయిన సైకిళ్లను వేలం వేసింది. ఈ వేలంలో సుమారు 21 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది.
లాక్‌డౌన్ సమయంలో చాలా మంది కాలి నడకన, సైకిళ్లపై సొంతూళ్లకు ప్రయాణం కట్టారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో సహరణ్ పూర్‌లో ప్రభుత్వం రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసింది. వలస కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేశారు. దీంతో వలస కార్మికులు తమ సైకిళ్లను వదిలిపెట్టుకుని బస్సులు, ట్రైన్ మార్గాల్లో స్వగ్రామానికి వెళ్లిపోయారు. ఇలా సహరణ్ పూర్‌లో సుమారు 14,600 మంది వలస కూలీలు తమ సైకిళ్లను వదిలిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా, వాటిని యూపీ ప్రభుత్వం వేలం
వేసింది. ఈ వేలంలో 5,400 సైకిళ్లను అధికారులు వేలం వేశారు. దీని ద్వారా 21లక్షల రూపాయలను ప్రభుత్వం
రాబట్టుకుంది.