
UP Election News 2022 : ఉత్తరప్రదేశ్ (utharpradesh)లో మూడో దశ ఎన్నికల నేపథ్యంలో సమాజ్ వాదీ (samajwadi) పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవినీతి, అన్యాయాన్ని రెట్టింపు చేసిందని ఆరోపించారు. తమ పార్టీ యూపీలో అధికారంలోకి వస్తే లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) కేసులో దోషులకు శిక్ష పడేలా చూస్తామని అన్నారు. పూర్తి స్థాయిలో కేసు కొనసాగిస్తామని చెప్పారు.
‘‘రైతులపై కారెక్కిచ్చిన మంత్రి కుమారుడికి కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రభుత్వం ఆ కేసును సరిగ్గా కొనసాగించలేదు. మా ప్రభుత్వం వస్తోంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసును పూర్తి స్థాయిలో కొనసాగిస్తాను. రైతుల ప్రాణాలను బలిగొన్న వారే కాదు, వారిని రక్షిస్తున్న వారు కూడా జైలుకు వెళ్తారు’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా (ajay mishra) కుమారుడు ఆశిష్ మిశ్రా (ashish mishra) బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన ఒక రోజు తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని బలిగొన్న లఖింపూర్ ఖేరీ ఘటనలో ఆయన ప్రధాన నిందితుడుగా ఉన్నారు. అశిష్ మిశ్రా గతేడాది అక్టోబర్‌లో అరెస్ట్ అయ్యారు.
కన్నౌజ్ (kannauj)లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో తన పార్టీ పనితీరుపై విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి, రెండో దశల్లో సమాజ్‌వాదీ పార్టీ, దాని కూటమి సెంచరీ చేసిందని అన్నారు. కన్నౌజ్ మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే తాను పెట్టిన కేసులను ఉపసంహరించుకున్న ఏకైక సీఎం యోగి ఆదిత్యనాథ్ అని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ‘‘ యోగి ఆదిత్యనాత్ (yogi adityanath) గత సమాజ్ వాదీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ వారి ప్రభుత్వ పనిని కూడా పరిశీలించండి. ఒక IPS ఆఫీసర్ పరారీలో ఉన్నారు. ఒక వ్యాపారిని పోలీసులు బలవంతపు వసూళ్ల పేరుతో కొట్టి చంపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై జీపు ఎక్కించిన లఖింపూర్ లాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడ జరగలేదు.’’ అని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, దీంతో పాటు పోలీసు ఉద్యోగాలను ప్రకటిస్తామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని అఖిలేష్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు వయోపరిమితిని సడలిస్తామని హామీ ఇచ్చారు. ‘‘ కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాల అర్హత వయస్సు దాటిపోయారు. మేము వయోపరిమితిలో సడలింపు ఇస్తాం.’’ అని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్, ఉచిత రేషన్ తో పాటు సమాజ్ వాదీ పెన్షన్ వంటి తన మ్యానిఫెస్టో ఉంచిన వాగ్దానాలను ఆయన పునరుద్ఘాటించారు.