
ఈ నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో (UP Elections 2022) గురువారం తొలి దశ పోలింగ్ ప్రారంభం కాగా, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో మొదటిదశ ఎన్నికలు పూర్తయిన క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి.
రాష్ట్రంలో మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav ) నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (Samajwadi Party) , ప్రియాంక గాంధీ ఇమేజ్‌తో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ (congress) ఉవ్విళ్లూరుతుండగా, దళితులు.. అణగారిన వర్గాల వారి వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కసరత్తు సాగిస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ‘లడ్ కీ హూ.. లఢ్ సక్తీ హూ’ అనే నినాదంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ ప్రచారంలోని పోస్టర్ గర్ల్స్ (ప్రచారంలో ప్రముఖమైన యువతులు) హస్తానికి హ్యాండిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంకా మౌర్య, వందనా సింగ్ అనే ఇద్దరు యువతులు బీజేపీలో చేరగా.. ఇప్పుడు మరో పోస్టర్ గర్ల్ కూడా కాషాయ తీర్ధం తీసుకున్నారు. శనివారం లక్నోలో జరిగిన కార్యక్రమంలో పార్టీ పెద్దల సమక్షంలో పల్లవి సింగ్ బీజేపీలో చేరారు.
కాగా... బుధవారం బీజేపీలో చేరే సమయంలో కాంగ్రెస్‌పై వందనా సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనవసర విషయాల్లోనూ పార్టీ హై కమాండ్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ఎప్పట్నుంచో ఉంటున్న తమను కాదని, కొత్తగా వస్తున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని వందనా సింగ్ మండిపడ్డారు. ఆరేళ్లు పార్టీ కోసం పనిచేశానని, కాంగ్రెస్ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించానని ఆమె గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రియాంకా గాంధీతో మాట్లాడే అవకాశమే రాలేదని, తమ కోసం తామే గొంతెత్తలేని పరిస్థితి ఉందని వందనా సింగ్ మండిపడ్డారు.
ఇకపోతే.. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, యోగి సర్కార్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ పావులు కదుపుతోంది.