
Uttar Pradesh election result 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ దండయాత్రతో సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటిన బీజేపీ.. ప్రస్తుత ట్రెండ్ గమనిస్తే.. 300 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే అధిక సంఖ్యలో అధిక్యంలో సమాజ్ వాదీ పార్టీ కొనసాగతున్నప్పటికీ.. ఆ పార్టీ అంచనాలకు అందనంత దూరంలో నిలిచిపోయింది. దీంతో బీజేపీ రాష్ట్రంలో తిరుగులేని విధంగా మళ్లీ అధికారం ఏర్పాటు చేసే సంకేతాలు అందుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లో గురువారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మూడు గంటలు దాటిన క్రమంలో ప్రస్తుత ట్రెండ్ గమనిస్తే.. బీజేపీ హవా కొనసాగిస్తోంది. మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అధిక్యం దాటి ముందుకు సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రత్యర్థులైన సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్, బీఏస్పీలపై తిరుగులేని ఆధిక్యం సాధించి, మెజారిటీ మార్కును దాటింది. ఇప్పటివరకు అందిన ఎన్నికల కౌంటింగ్ వివరాల ప్రకారం.. బీజేపీ 309 స్థానాల్లో అధిక్యంలో ఉంది. సమాజ్ వాదీ పార్టీ 84 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్, బీఎస్పీలు చెరో మూడు స్థానాల్లో అధిక్యంలో ఉండగా, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. గోరఖ్‌పూర్ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కర్హల్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జస్వంత్ నగర్ నుంచి ఆయన పార్టీకి చెందిన శివపాల్ యాదవ్, సిరతు నుంచి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అధిక్యంలో ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. గతంలో కంటే ఈ సారి జరిగిన ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అధికార పార్టీ బీజేపీ.. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ప్రచారం సాగిస్తూ.. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశాయి. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు సైతం గత వైభవం కోసం గట్టిగానే పోరాటం సాగించాయి. యూపీ ప్రస్తుత అసెంబ్లీ గడువు మార్చి 14తో ముగుస్తుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరిగాయి.
ఇక ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత (ఎస్పీ), మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కర్కల్ నియోజవర్గం నుంచి బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గమనిస్తే.. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 325 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ కేవలం 47 సీట్లు, కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్పీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం కాంగ్రెస్, బీఎస్పీలు దారుణంగా పడిపోయాయని కౌంటింగ్ ఫలితాలు చూపిస్తున్నాయి.