
యూపీ (Up)లో బీజేపీ (bjp) రెండో సారి అధికారం చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన స్థానాల కంటే ఈ సారి కొన్ని సీట్లు తక్కువే సాధించనప్పటికీ బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది. మొత్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిపి 273 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో రెండో సారి యోగి ఆదిత్యనాథ్ (yogi adityanth) సీఎం పీఠం ఎక్కనున్నారు.
2017తో పోలిస్తే ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కొంత మెరుగైన స్థానాలనే సాధించినప్పటికీ.. అధికారం చేపట్టాలనే కోరిక మాత్రం నెరవేరలేదు. సమాజ్ వాదీ పార్టీ (samajwadi party) సొంతంగా 111 సీట్లు గెలుచుకోగా, దాని నేతృత్వంలోని కూటమి 125 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అయితే బహుజన్ సమాజ్ పార్టీ (bsp), కాంగ్రెస్ (congress) ఘోర పరాజయం పాలయ్యాయి. కాంగ్రెస్ రెండు స్థానాలు, బీఎస్పీ ఒక స్థానంలో మాత్రమే గెలుపొందింది.
ఉత్తరప్రదేశ్ లో ఈ సారి బీఎస్పీ (bsp) ఘోర ఫలితాలను చవిచూసింది. ఈ రాష్ట్రంలో మొదటి నుంచి ఆ పార్టీకి పట్టు ఉండేది. అయితే క్రమంగా అది తన ప్రాభల్యం కోల్పొతూ వస్తోంది. ఈ సారి కేవలం 1 స్థానానికి మాత్రమే పరిమితమవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. కాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ పాత్రపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బీఎస్పీ చీఫ్ మాయావతి (mayawathi) బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని, ఆ పార్టీ కాషాయ పార్టీకి బీ టీమ్ గా మారిందని విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను మాయవతి ఖండించారు. బీజేపీతో యుద్ధం సూత్రప్రాయంగా జరిగిందని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆమె శుక్రవారం తొలిసారిగా మీడియాతో మాయావతి మాట్లాడారు. బీఎస్పీకి వచ్చిన ఘోరమైన ఫలితాలపై విచారం వ్యక్తం చేశారు. దీని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ‘‘యూపీ ఎన్నికల ఫలితాలు బీఎస్పీ అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో మనం నిరుత్సాహపడకూడదు. బాధపడే బదులు దీని నుంచి ఎంతో నేర్చుకోవాలలి. ఆత్మ పరిశీలన చేసుకుని, పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. తిరిగి అధికారంలోకి రావాలి ’’ అని అన్నారు.
‘‘ 2017 ఎన్నికలకు మందు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి మంచి వాటా లేదు. అలాగే నేడు కాంగ్రెస్ కూడా బీజేపీ ఎదుర్కొన్న పరిస్థితి ఎదుర్కొంటోంది. యూపీ ఎన్నికల ఫలితాలు మా ప్రయత్నాలను కొనసాగించడానికి మాకు ఒక గుణపాఠం ’’ అని మాయావతి చెప్పారు. విమర్శకులపై విరుచుకుపడిన మాయావతి.. ప్రతికూల ప్రచారాలు ఓటర్లను తప్పుదోవ పట్టించడంలో సఫలమయ్యాయని అన్నారు. ‘‘ ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రచారం ఏమిటంటే BSP అనేది BJP B-టీమ్ అని, కానీ ఇది అబద్దం. బీఎస్పీకి బీజేపీకి మధ్య సూత్రపాత్రంగా యుద్ధం జరిగింది ’’ అని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీలో ప్రస్తుతం బీఎస్పీకి ఒక సీటు మాత్రమే ఉంది. పార్టీ వాయిస్ ను అసెంబ్లీలో బలంగా వినిపించే అవకాశం లేకుండా పోయింది. అయితే రాష్ట్ర ఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లలో 12.9 శాతం ఓట్లను సాధించడం ద్వారా BSP మూడో అత్యధిక ఓట్ షేర్‌ను సాధించగలిగింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 41.3 శాతం ఓట్లు సాధించి బీజేపీ రెండో సారి అధికారం చేపట్టబోతోంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ 32 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.