UP Election 2022: 61 స్థానాలు.. బ‌రిలో 692 మంది అభ్యర్థులు.. యూపీ ఐదోద‌శ పోలింగ్ లో దిగ్గ‌జ నేత‌లు !

Published : Feb 26, 2022, 01:50 PM IST
UP Election 2022: 61 స్థానాలు.. బ‌రిలో 692 మంది అభ్యర్థులు.. యూపీ ఐదోద‌శ పోలింగ్ లో దిగ్గ‌జ నేత‌లు !

సారాంశం

UP Assembly Election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు తుదిద‌శ‌కు చేరుకుంటున్నాయి. ఇప్ప‌టికే నాలుగు ద‌శ‌ల ఎన్నిక‌ల పోలింగ్ పూర్తి కాగా, ఆదివారం నాడు జ‌రిగే ఐదో ద‌శ పోలింగ్ లో కీల‌క నేత‌లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు.   

UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ముగిశాయి. అయితే, ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఇప్ప‌టికే ప‌లు ద‌శల‌ ఎన్నిక‌లు పూర్త‌యిన క్ర‌మంలో రాజ‌కీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రం (Uttar Pradesh) లో మ‌ళ్లీ అధికారం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా, మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ సైతం త‌న‌దైన స్టైల్ లో ప్ర‌చారం కొన‌సాగిస్తూ.. అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. కాంగ్రెస్‌, బీఎస్పీలు సైతం గ‌ట్టిపోటీగా ముందుకు సాగుతున్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం నాడు ఐదవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో ప్రధానంగా 61 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాల్లో అమేథీ, రాయ్‌బరేలీ , సుల్తాన్‌పూర్, చిత్రకూట్, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ , అయోధ్య, గోండా ప్రధాన నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 61 స్థానాల్లో మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదో ద‌శ‌లో రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల నుంచి కీల‌క నేత‌లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. ఐదో ద‌శ‌లో 692 మంది అభ్య‌ర్ధుల భ‌విత‌వ్యాన్ని 2.24 కోట్ల మంది ఓట‌ర్లు తేల్చ‌నున్నారు. సిరతు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య , రాంపూర్ ఖాస్ నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధన మిశ్రా , కుంట సీటు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా , యూపీ కేబినెట్ మంత్రులు పోటీలో ఉన్నవారిలో ప్రముఖులు. అలహాబాద్ వెస్ట్ నుండి సిద్ధార్థ్ నాథ్ సింగ్, అలహాబాద్ సౌత్ నుండి నంద్ గోపాల్ గుప్త నాడి మరియు రాజేంద్ర ప్రతాప్ సింగ్ అలియాస్ మోతీ సింగ్ లు పోటీ ప‌డుతున్నారు. 

కేంద్ర మంత్రి అనుప్రియా ప‌టేల్ త‌ల్లి, అప్నాద‌ళ్ నేత కృష్ణా ప‌టేల్ అప్నాదళ్ కే త‌ర‌పున‌ ఐదో ద‌శ పోరులో నిలిచారు.  కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఐదో దశ ఎల‌క్ష‌న్ ప్రచారం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అజయ్ కుమార్ శుక్లా తెలిపారు. ఐదో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంద‌ని తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత అసెంబ్లీల గడువు మార్చి 14తో ముగుస్తుంది. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు ద‌శ‌ల పోలింగ్ ముగిసింది. ఆదివారం నాడు ఐదో ద‌శ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మిగిలిన రెండు దశల ఎన్నిక‌ల పోలింగ్‌ మార్చి 3, మార్చి 7న జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే, ఈ ఎన్నిక‌ల్లో అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)-ప్ర‌తిప‌క్ష స‌మాజ్ వాదీ పార్టీల మ‌ధ్య పోరు ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ