
Up election news 2022 : మరి కొన్ని రోజుల్లోనే ఉత్తర్ ప్రదేశ్ (uthara pradhesh)లో ఎన్నికలు మొదటి దశ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఓటర్లకు హామీలు గుప్పిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం అని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఓ విభిన్న ప్రకటన చేశారు. అగ్రాలో వోడ్కా ప్లాంట్ (vodka plant) నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఆదివారం ఆగ్రా (agra)లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లో పోలీసు రిక్రూట్‌మెంట్ (police recruitment)లో వయోపరిమితిని సడలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బంగాళ దుంపలను ప్రాసెస్ చేయడానికి పరిశ్రమల స్థాపనకు, వోడ్కా ప్లాంట్‌ను కూడా నిర్మించడానికి సబ్సిడీని అందిస్తామని చెప్పారు. ‘‘ ఇక్కడ బంగాళదుంప ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తాం. అవసరమైతే వోడ్కా ప్లాంట్ (vodka plant) కూడా నిర్మిస్తాం. బంగాళదుంపలతో వోడ్కా తయారు చేయవచ్చో లేదో చెప్పండి?’’ అని ప్రచార సభలో ఆయన ప్రజలను ప్రశించారు.
అఖిలేష్ యాదవ్ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే మొదటిసారి కాదు. 2015లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కన్నౌజ్, ఫరూఖాబాద్ జిల్లాల్లో ఒక వోడ్కా తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆగ్రా సభలోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాంతం బంగాళాదుంప పంటకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడంతో ఉత్పత్తులు వృథాగా ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సమాజ్‌వాదీలు నిరసనలు చేపట్టి తమ బంగాళదుంప ఉత్పత్తులను లక్నోలోని సీఎం ఇంటి వెలుపల (జనవరి 2018లో) పడవేశారని గుర్తు చేశారు. బీజేపీ (bjp) నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల నుంచి బంగాళాదుంపలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ అది అమలు చేయలేదని విమర్శించారు.
గత కొన్నేళ్లుగా వోడ్కా మార్కెట్ వాటా పెరిగిందని అఖిలేష్ యాదవ్ చెప్పారు. ‘‘ ఈ ప్రాంతంలో బంగాళదుంపలను ప్రాసెస్ చేయడానికి, చిప్స్, స్నాక్స్ చేయడానికి పరిశ్రమలను స్థాపించడానికి మేము రూ. 100-200 కోట్ల సబ్సిడీని అందిస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను. అవసరమైతే, మేము వోడ్కా తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తాము. ఈ ప్రాంత రైతులు పండించిన బంగాళదుంపలు వృథా అవుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
యూపీ అసెంబ్లీకి 403 స్థానాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీకి 2017లో చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీని ఓడించి బీజేపీ అధికారం చేపట్టింది. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. మళ్లీ తిరిగి ఎలాగైనా అధికారం చేపట్టాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సారి బీజేపీ ఒంటరిగా పోటీ చేయనుండగా... సమాజ్ వాదీ పార్టీ ఆర్ఎల్ డీ తో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. రాష్ట్రంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన మొదటి దశ, మార్చి 7న ఏడో దశలో జరుగుతాయి. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు.