UP Election 2022 : నేడు యూపీలో ఏడో ద‌శ ఎన్నిక‌లు.. 9 జిల్లాల్లోని 54 స్థానాల‌కు పోలింగ్..

Published : Mar 07, 2022, 08:55 AM IST
UP Election 2022 : నేడు యూపీలో ఏడో ద‌శ ఎన్నిక‌లు.. 9 జిల్లాల్లోని 54 స్థానాల‌కు పోలింగ్..

సారాంశం

యూపీ అసెంబ్లీకి నేడు చివరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. తొమ్మిది జిల్లాల పరిధిలోని 54 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ జరుగుతోంది. ఈ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల భద్రత కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.   

UP Election News 2022 :  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు చివ‌రి అంకానికి చేరుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 6 ద‌శల్లో ఎన్నిక‌లు ముగిశాయి. దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం కావ‌డంతో యూపీలో ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన మొద‌టి ద‌శ ఎన్నిక‌లు ప్రారంభ‌మయ్యాయి. ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన రెండో ద‌శ‌, ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన మూడో ద‌శ‌, ఫిబ్ర‌వ‌రి 23న నాలుగో ద‌శ‌, ఫిబ్ర‌వ‌రి 27న ఐదో ద‌శ‌, మార్చి 3వ తేదీన ఆరో ద‌శ ఎన్నిక‌లు ముగిశాయి. నేడు చివ‌రి ద‌శ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఏడో, చివరి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 54 స్థానాలకు గాను 613 మంది అభ్యర్థులు బరిలోకి నిలిచారు. ఈ ఎన్నిక‌ల్లో సుమారు రెండు కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలోని పూర్వాంచల్ ప్రాంతంలోని తొమ్మిది జిల్లాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఇందులో అజంగఢ్, మౌ, జౌన్‌పూర్, ఘాజీపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, భదోహి, సోన్‌భద్ర జిల్లాలు ఉన్నాయి.  9 జిల్లాల్లో జ‌రుగుతున్న పోలింగ్ లో  2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 29 సీట్లు, ఏడు దాని మిత్రపక్షాలు గెలుపొందాయి. సమాజ్‌వాదీ పార్టీ 11 సీట్లు, ఆరు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) గెలుచుకుంది. మూడు సీట్లు కాంగ్రెస్‌, ఐదు ఇతర చిన్న పార్టీలు గెలుచుకున్నాయి.

2017 ఎన్నిక‌ల్లో ముఖ్యంగా ప్రధాని మోదీ సొంత నియోజకవర్గ‌మైన వారణాసి జిల్లాలో బీజేపీ అనూహ్యంగా ప్రభావం చూపింది. ఈ జిల్లా ప‌రిధిలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలైన పింద్రా, అజగర, శివపూర్, రోహనియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కాంట్, సేవాపూర్ బీజేపీ విజ‌యం సాధించింది. కాగా యాదవులు, ముస్లింల ఆధిపత్యం ఉన్న అజంగఢ్ జిల్లా స‌మాజ్ వాదీ పార్టీకి కంచు కోట‌గా ఉంది. 2017 ఎన్నిక‌ల్లో ఇక్కడ ఆ పార్టీ 10 సీట్లలో 5 కైవసం చేసుకోగలిగింది. అయితే 2017 ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న అజంగఢ్ జిల్లా ప్ర‌స్తుతం బీజేపీకి అతిపెద్ద సవాలుగా మారింది.

నేటి ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. ఇది సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓట్ల లెక్కింపు కార్య‌క్ర‌మాన్ని మార్చి 10వ తేదీన చేప‌ట్ట‌నున్నారు. 177 పోలీస్ స్టేషన్ పరిధిలోని 12,205 పోలింగ్ స్టేషన్లు, 23,535 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరగనుంది. మహిళల ఓటింగ్ ను పెంపొందించ‌డానికి 78 పింక్ బూత్‌ల‌ను (మహిళా బూత్‌లు) ఎన్నిక‌ల సంఘం ఏర్పాటు చేసింది. ఇందులో 12 మంది మహిళా ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు,  216 మంది మహిళా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లను సిబ్బందిగా నియ‌మించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు మొత్తం 12,205 పోలింగ్ స్టేషన్లు CAPF పరిధిలోకి వస్తాయి. ఏడో ద‌శ ఎన్నిక‌ల కోసం మొత్తంగా CAPF కు చెందిన 845 కంపెనీలను రంగంలోకి దించారు.
 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు