
UP Election News 2022 : యూపీలో ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తున్నాయి. దీంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. మొదటి దశ ఎన్నికలకు కేవలం మరో ఐదురోజులు సమయం ఉంది. ఈ క్రమంలో యూపీలో సీపీఐ (ఎం) (CMI - M) సమాజ్ వాదీ పార్టీకి (Samajwadi party) మద్దతు ఇచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ నేత సీతారం ఏచూరి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు.
బీజేపీ (bjp) ని ఎదుర్కొవడమే తమ ప్రధాన లక్ష్యమని సీతారాం ఏచూరి (Sitaram Yechury) అన్నారు. అందుకే తమ పార్టీ సమాజ్ వాదీ పార్టీకి మద్దతు ఇస్తుందని అన్నారు. హిందూత్వ ఎజెండాకు వ్యతిరేకంగా లౌకిక శక్తులను సమీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘యూపీలో ఎన్నికలలో మేము సమాజ్ వాదీ పార్టీకి మద్దతు ఇస్తాము. మేము రాష్ట్రంలో కేవలం నాలుగు స్థానాల నుంచిమాత్రమే పోటీ చేస్తున్నాము. పంజాబ్‌లో బీజేపీని ఓడించే పార్టీకి మేము మద్దతు ఇస్తాము’’ అని ఆయన తెలిపారు.
తూర్పు ఉత్తరప్రదేశ్‌లో సీపీఐ(ఎం) ఆరు స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెడుతుందని వార్తలు వెలువడ్డాయి. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు విషయంలో గతంలో చర్చలు జరిగినప్పటికీ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే శుక్రవారం మీడియాతో మాట్లాడిన సీతారం ఏచూరి బీజేపీని నిలువరిచేందుకు తాము పొత్తు పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు.
సమాజ్ వాదీ పార్టీ, ఆర్ఎల్ డీ (rld) కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మరో మీడియా సమావేశంలో అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) మాట్లాడారు. యూపీలో వచ్చే ఎన్నికలు ‘బ్రదర్‌హుడ్ వర్సెస్ బీజేపీ’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఆర్ ఎల్ డీ చీఫ్ జయంత్ చౌదరి కూడా ఉన్నారు.
403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న, రెండో దశ ఫిబ్రవరి 14న, మూడో దశ ఫిబ్రవరి 20న, ఫిబ్రవరి 23న నాలుగో దశ, ఫిబ్రవరి 27న ఐదో దశ, మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశలో జరుగుతాయి.
ఈ సారి జరిగే ఎన్నికల్లో మొట్ట మొదటి సారిగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్, ఆ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ అలాగే, మరో అధికార పార్టీ అయిన బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ (yogi adhityanath)లు మొదటి సారిగా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరు సీఎం పదవి చేపట్టి ఉత్తర్ ప్రదేశ్ ను పరిపాలించినప్పటికీ ఒక్క సారి కూడా శాసన సభకు ఎన్నిక కాలేదు. శాసన మండలికి నామినేట్ అయి అక్కడి నుంచి సీఎం పదవిని అధిష్టించారు. యోగి ఆదిత్యనాథ్ ఎంపీగా గెలుపొందినప్పటికీ పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు ఆయన సీఎం పగ్గాలు చేపట్టారు. ఈ సారి కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ (priyanka gandi) కూడా శాసన సభకు పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆ పార్టీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.