UP Election 2022: తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో Akhilesh Yadav.. ఆ ఒత్తిడితో రూట్ మార్చిన మాజీ సీఎం..!

By Sumanth KanukulaFirst Published Jan 19, 2022, 12:03 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ( Akhilesh Yadav) యూ టర్న్ తీసుకున్నారు. గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన అఖిలేష్.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్దం చేసుకన్నట్టుగా తెలుస్తోంది. 

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్దం చేసుకన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందింది. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్.. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ (Azamgarh) లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అఖిలేష్ కొంతకాలంగా కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను రాష్ట్రంలోని ప్రతి స్థానంపై దృష్టి సారించనున్నట్టుగా వెల్లడించారు. మరోవైపు గతంలో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అఖిలేష్.. శాసన మండలి సభ్యునిగా కొనసాగారు.

అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన  Akhilesh Yadav.. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అఖిలేష్ అసెంబ్లీ ఎన్నికలో బరిలో నిలవనున్నారు. అయితే ఆయన పోటీ చేసే స్థానం ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. అఖిలేష్ యాదవ్‌పై ఒత్తిడి వచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. ఇక, తొలిసారి అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలుస్తున్న యోగి.. తూర్పు యూపీలోని తన స్వస్థలమైన గోరఖ్‌పూర్‌ నుంచి బరిలో నిలవనున్నారు. 

సమాజ్‌వాదీ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తారని వెల్లడించారు. అయితే అఖిలేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు మాత్రం.. దానిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇక, ఈరోజు (జనవరి 19) మధ్యాహ్నం 1 గంటలకు లక్నోలోని పార్టీ కార్యాలయంలో అఖిలేష్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వారి పార్టీ విజన్, తాను పోటీ చేయబోయే అంశంతో పాటుగా మరిన్ని వివరాలను అఖిలేష్ వెల్లడించే అవకాశం ఉంది. 

యోగిని బరిలో దింపడం వెనక బీజేపీ పక్కా ప్లాన్..
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్‌ నుంచి యోగి ఆదిత్యనాథ్‌ను బరిలో దింపడం వెనక బీజేపీ పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తుంది. ఇప్పటికే తూర్పు ఉత్తరప్రదేశ్‌లో పలువురు నేతలు పార్టీని వీడటంతో.. ఆ ప్రాంతంలో సీట్లు తగ్గకుండా చూసుకునేందుకే యోగిని అక్కడి నుంచి బరిలో దింపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. యోగికి ఆ ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన గోరఖ్‌నాథ్‌ మఠానికి యోగి అధిపతిగా ఉన్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా విజయం సాధించారు. దీంతో గోరఖ్‌పూర్‌లో యోగి విజయం సులవైన పనే అని.. తద్వారా ఆయన ఇతర ప్రాంతాలపై ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

click me!