ఉత్తర ప్రదేశ్ యువతకు సీఎం యోగి గుడ్ న్యూస్ ... ఇక ఉద్యోగాల జాతరే!

By Arun Kumar PFirst Published Sep 24, 2024, 5:52 PM IST
Highlights

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ యువతకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టే కమీషన్లు, బోర్డులతోో సమావేశమైన సీఎం వెంటనే ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. 

లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో యూపి పబ్లిక్ సర్వీస్ కమిషన్, సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్, ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమిషన్, విద్యుత్ సేవా కమిషన్, పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్, కోఆపరేటివ్ ఇన్‌స్టిట్యూషనల్ సర్వీస్ బోర్డ్  చైర్ పర్సన్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇలా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టే అన్ని శాఖలతో సీఎం యోగి చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఈ సమావేశంలో ఉద్యోగాల భర్తీపై సుదీర్ఘ చర్చ జరిగింది. అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టే బోర్డులు, కమీషన్ల ఛైర్మన్లకు సీఎం యోగి ఆదిత్యనాథ్ దిశానిర్దేశం చేసారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని ఉద్యోగాల భర్తీలపై సీఎం సమాచారం సేకరించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, సకాలంలో పూర్తి చేయాలని సీఎం యోగి ఆదేశించారు.

Latest Videos

ఇటీవల విజయవంతంగా పూర్తయిన పోలీసు నియామక పరీక్ష ప్రక్రియ, నిర్వహణ గురించి పోలీసు నియామక ప్రమోషన్ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వివరించారు. యూపీ పోలీసు నియామక పరీక్ష విజయవంతంగా పూర్తయిందని... ఇది ఒక మోడల్‌గా నిలిచిందని సీఎం అన్నారు. ఈ పరీక్ష విధానాన్ని ఇతర నియామక బోర్డులు కూడా అనుసరించాలని సూచించారు.

రాష్ట్రంలో ఇ-సేవల పోర్టల్ ఏర్పాటు చేశామని, అన్ని శాఖలు దీని ద్వారా సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నియామకాలు జరగాల్సిన శాఖలు వెంటనే కమిషన్‌కు సమాచారం పంపించి, నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. భర్తీ ప్రక్రియలో ఎక్కడ కూడా జాప్యం చేయకూడదని, నిర్ణీత గడువులోపు అన్ని ప్రక్రియలను సజావుగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

 ఎలాంటి ప్రైవేట్ సంస్థలనూ పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయకూడదని... ప్రభుత్వం లేదా ప్రభుత్వ సహాయంతో నడిచే విద్యాసంస్థల్లో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయాలని సూచించారు.

పరీక్షలను సజావుగా నిర్వహించడం కోసం అన్ని బోర్డులు, కమిషన్ల ఛైర్మన్లు, అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్‌తో సమావేశం నిర్వహించాలని సూచించారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీసీటీవీల సహాయం తీసుకోవాలి. తప్పుడు ప్రచారాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. 

అన్ని రకాల భర్తీ ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయడం కోసం ప్రశ్నా బ్యాంకులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అన్ని బోర్డులు, కమిషన్లను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగకుండా చూసేందుకు ఇది చాలా అవసరమని అన్నారు.

వైద్య, సాంకేతిక విభాగాల్లో స్థానిక స్థాయిలో బోర్డులను ఏర్పాటు చేసి త్వరగా నియామకాలు చేపట్టాలన్నారు. అన్ని నియామక ప్రక్రియల్లో రిజర్వేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. 

click me!