అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు: మహాభారతంలోని పాత్రలతో అఖిలేశ్‌‌ ఫ్యామిలీపై యోగి సెటైర్లు

By Siva KodatiFirst Published Mar 13, 2021, 8:38 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కుటుంబ సభ్యులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అఖిలేశ్ కుటుంబ సభ్యులను కౌరవులతో పోల్చిన ఆయన.. నేరుగా పేర్లను ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కుటుంబ సభ్యులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అఖిలేశ్ కుటుంబ సభ్యులను కౌరవులతో పోల్చిన ఆయన.. నేరుగా పేర్లను ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు. 2012-17 మధ్య కాలంలోనూ, మహాభారతంలోనూ కాకా, చాచా, మామ, నానా కనిపిస్తారంటూ సెటైర్లు వేశారు. 

ప్రభుత్వ శాఖల్లో నియామకాల బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించే వంశాలు ఉండేవంటూ సీఎం ఎద్దేవా చేశారు. కొన్ని శాఖలను మేనమామలకు, మరికొన్ని శాఖలను సోదరులకు, ఇంకొన్ని శాఖలను మేనల్లుళ్ళకు అప్పగించేవారని ఆదిత్యనాథ్ అఖిలేష్‌పై చురకలు వేశారు.

ఇలాంటివన్నీ ఒకప్పుడు జరిగేవని... అయితే మహాభారతంలోని వ్యక్తులు మళ్ళీ పుట్టారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహా భారత యుద్ధం చేసి దేశ ప్రగతిని అడ్డుకున్నట్లుగానే, వాళ్ళు మళ్ళీ ఉత్తర ప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకున్నారన్నారంటూ ఆరోపించారు.

ప్రతిభ, నిజాయితీలకు విలువ ఇవ్వకుండా, కులం, డబ్బు బలంతో నియామకాలు చేపడితే, రాష్ట్రం ఇబ్బందులపాలవుతుందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మీరు కూడా నియామకాల కోసం మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులతో సిఫారసులు చేయించుకున్నారా అంటూ ఆయన  కొత్తగా నియమితులైన 271 మంది బ్లాక్ విద్యాశాఖాధికారులను ప్రశ్నించారు.

తన ప్రభుత్వం చేపట్టిన నియామకాలపై ఎటువంటి ఫిర్యాదులు లేవన్న ఆదిత్యనాథ్.. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా నిజాయితీగా, పారదర్శకంగా, ఎటువంటి వివక్ష లేకుండా జరిగేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని చెప్పారు. 

రాష్ట్రాన్ని ఎలా నడుపుతారంట తనను చాలా మంది ప్రశ్నించేవారని సీఎం గుర్తు చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌కు విస్తృతమైన అవకాశాలు, సామర్థ్యం ఉన్నట్లు అప్పట్లోనే చెప్పానని ఆయన వెల్లడించారు. రాష్ట్రాన్ని నడపటానికి కేవలం నాయకత్వం మాత్రమే అవసరమన్న ఆయన.. గతంలో ఉన్న వ్యవస్థే ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ, రాష్ట్రం మారిందని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

click me!